ఆటోప్సి!

మే 6th, 2011 § అభిప్రాయములు

“నా బిడ్డ కి ఎట్లున్నది సారూ?” ఎవరో ఒకావిడ అడుగుతోంది. నలిగిపోయిన చీర కట్టుకుని, దాంతోనే చెమట తుడుచుకుంటోంది..మొహం మీద ఉన్న ముడతలు, సన్నని దేహం-తన వాలకం చూస్తుంటే వయసు యాభై పైనే ఉండి ఉండొచ్చు అనిపిస్తోంది. చీర, చెప్పులు చూస్తుంటే పేదవారనిపిస్తోంది.

“ఏం సారూ..ఏం అనవు..”
“కొంచం సీరియస్ గానే ఉంది.” ఈ మాట ఎలా చెప్పానో నాకే తెలీదు..
“గంటె ఏంటి సారూ..” ఆమె కళ్ళు నిండుగా ఉన్నాయి..

“కొంచం సేపు అయితే పెద్ద డాక్టర్ వచ్చి అన్ని చెప్తాడు అమ్మా..మీరు అన్నీ ఆయన్నే అడగండి..” అన్నాను..ఆవిడకి అర్ధం అయినట్టుంది..
“నువ్వే ఏదన్న జేసి…”
“పెద్ద డాక్టర్ వస్తాడమ్మా..” అని తనని మధ్యలో ఆపి చెప్పాను..
“చిన్న దేవుడు..పెద్ద దేవుడు ఉంటాడా సారు. నువ్వే దయ సూపీ..ఆడి ఊపిరి ఆగనివ్వకు..నీకు దణ్ణం పెట్టుకుంటా..” ఎడ్చేస్తోంది..
నేనేమో ఇక్కడ హౌస్ సర్జన్సీ కోసం వచ్చాను..నేనేం చెయ్యగలను..మహా అయితే రంగం సిద్దం చెయ్యగలను..మిగితావన్నీ పెద్ద డాక్టర్లే చెయ్యాలి. ఆయనకి కాల్ చేసి పిలుద్దాం అనుకుని ఆవిడకి చూస్తానులే అని చెప్పి లోపలకి వచ్చాను..
ఆయనకి కాల్ చేశాను..సరే వస్తున్నా అని చెప్పి పెట్టేసాడు..ఆయనకి  వాళ్ళ ఇంటి దెగ్గర క్లినిక్ ఉంది..ఇది, అది రెండు ఆయనే చూస్కుంటాడు..అక్కడ వచ్చే లాభం ఇంకా ఎక్కువ..కాబట్టి సహజంగానే అక్కడి డ్యూటీ మీద కాస్త ఎక్కువ శ్రద్ధ పెడతాడు.అసలు మొదట్లో అనుకునేవాడ్ని ఇలా ఎందుకు చెయ్యాలి..ఏం ఇక్కడ సంపాదిస్తోంది సరిపోదా అని? దానికి సమాధానం మాత్రం అనుకోకుండా మా బామ్మ చెప్పింది..నా తమ్ముడు సాఫ్ట్వేర్  ఇంజినీరు. వాడికి నెలకి 60  వేలు వస్తుంది. ఎప్పటికో కాని నాకు అంత రాదు అని మా బామ్మకి చెప్తే …నీకంటే చిన్నోడి చదువే బాగుంది కదరా..నువ్వు ఎక్కువ ఏళ్ళు చదివి తక్కువ సంపాదిస్తావు..వాడు తక్కువ ఏళ్ళు చదివి ఎక్కువ సంపాదిస్తాడు  అని..నేను నవ్వుకున్నాను..
అసలు చాలా మంది అభిప్రాయం కూడా అదే..చదివే చదువుకి, సంపాదించే రొక్కంకి ఎందుకు ఇలా సంబంధం పెడతారో అర్ధం అవ్వదు నాకు. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు..బిళ్ళ బంట్రోతు నుండి గవర్నర్ ఉద్యోగందాక ఏ ఉద్యోగానికి ఉండవలసిన,దక్కవలసిన గౌరవం దక్కేది. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు లక్షల్లో సంపాదించటం మొదలుపెట్టాక మనుషుల వైఖరి మారటం మొదలుపెట్టింది.. వెధవది..మనిషి చేతుల్లో మారే డబ్బు మనుషులనే మార్చేసింది..
“అరుణ్…could you please get the latest reports and direct Nischala to make arrangements for a surgery?” ఆయన వచ్చేసారు. నేను కూడా నా ఆలోచనల్లోంచి ఈ లోకం లోకి వచ్చేసాను.
“ఎస్ సర్..in a moment.”
******
సర్జరీ పూర్తి అయ్యింది. అతను చనిపోయాడు.
“మీరొక పని చెయ్యండి. ఈ అబ్బాయి తాలూకు వాళ్ళతో జరిగిన విషయం చెప్పండి..ఆటోప్సికి రెడీ చేసి  పాతోలోజీ ల్యాబ్ వాళ్ళకి కూడా ఇంఫారం చెయ్యండి. సీనియర్లు ఉంటారు కదా..వాళ్ళని అడగండి..ఏమేం చెయ్యాలో ఎలా చెయ్యాలో చెప్తారు..” డాక్టర్ గారు నాతొ చెప్పారు.
“సర్..వాళ్ళ అమ్మకి… నేను…” ఈ చావు వార్త ఎలా  చెప్పాలో నాకు అర్ధం కావటం లేదు..చాలా సార్లు విన్నాను ఇలా సీనియర్లు “చావు కబురు మీరే బంధువుల చెవిలో వెయ్యండి” అని చెప్తారని. ఈయన కూడా అలాగే చెప్పారు..
“అరుణ్..పర్సనల్ గా తీస్కోకండి..ఇలాంటివి జరుగుతూ ఉంటాయి..మనం మన సాయసక్తులా ప్రయత్నించాం..అసలు చాలా మేజర్ ఆక్సిడెంట్ అండి ఇది..”
“ఓకే సర్..”
“వాళ్ళకి చెప్పేసి మిగితా పనులు చూడండి.. ప్రాక్టికల్ జరగట్లేదు అని మెడికల్ కాలేజీ నుండి కంప్లైంట్ ఉంది..దాని గూర్చి రిపోర్ట్ ఇస్తాడు శేఖర్..మీరు సాయంత్రం వచ్చినప్పుడు నాకు తెచ్చి ఇవ్వండి”
శేఖర్ మెడికల్ కాలేజీ ప్యూన్. నేను రోజూ సాయంత్రం డాక్టర్ గారి ఇంటికి వెళ్లి పీజీ ఎంట్రన్సు టెస్ట్ కి ప్రిపేర్ అవుతూ ఉంటాను.
“ఓకే సర్..”
బయట ఆవిడతో పాటు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. బహుశా తోడూ వచ్చారు అనుకుంటాను.
“చిన్న సారు వచ్చిండు..” అని ఎవరో చెప్పంగానే నా దెగ్గరికి పరిగెత్తుకుని వచ్చారు..
“మీ అబ్బాయే కదండీ..” తెల్సే అడిగాను..
“అవును సారు..”
“అతను..అతనికి..” మాట రావట్లేదు..
“పెద్ద ఆపరేషన్ చెయ్యాలి అని పెద్ద డాక్టేరు చెప్పిండు..చేసిన్రా?”
“అవును..పెద్ద ఆపరేషన్ చెయ్యాలి..”
“చేసెయ్యి సారు.” వాళ్ళ అమ్మ అంటోంది.
“లేదు చేసేసాము..” దేవుడా!..ఎందుకు ఇంత కష్టమైన పని నాకు ఇచ్చారు అనుకున్నాను..
“ఎట్లుంది నా బిడ్డకి..”
“అతనికి చాలా దెబ్బలు తగిలాయి కదా..”
“అవు సారు..మీదికెల్లి కప్పు కూలిపోయింది..నెత్తి మీదే పడ్డాయి ఇట్కెలు..”
“అవును..అందుకని అతనికి స్కల్ ఫ్రాక్చర్  అయ్యింది..అందుకని..”
“గంటె ఏంటి?”
“అంటే నా ఉద్దేశం..పుర్రె ఉంటుంది కదా..అది పగిలింది..”
“గప్పుడు ఏం జేస్తరు..” ఎవరో అడిగారు..
“పెద్ద ఆపరేషన్లా గా పుర్రె పలిగిన చోట్ల కుట్లేసి ఉంటరు..” ఇంకెవరో చెప్పారు..
“లేదు అలా చెయ్యరు..అంటే చెయ్యలేరు..”
నన్నే అందరు ఆత్రంగా ఏం  చెప్తానో అని చూస్తున్నారు..
“చూడమ్మా..అతనికి దెబ్బలు చాలా గట్టిగా తగిలాయి..అందుకే అతన్ని బతికించటం చాలా కష్టమైన పని..అది మావల్ల కాలేదు..” ఎలా చెప్పానో తెలీదు కాని చెప్పేసాను..
“గంటె మా బిడ్డ..”
“చనిపోయాడమ్మ” నా గొంతు మారింది.
“బిడ్డా…” అని ఆమె ఏడుపు ప్రారంభించింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు  కూడా..
“గా మేస్త్రికాడికి పోకురా అంటే వింటివి గాదు బిడ్డా ..గియ్యాల గదే నీ చావు తెచ్చింది కదా..మీ అయ్య కాడికే పోతివి..నేనేం పాపం జేస్తిరా..నన్ను ఇడిసి పోయారు..దీని పెళ్లి నేనెట్ల జేస్తి..నన్ను,దీన్ని కూడా తీస్కపో దేవుడా”
నాకు చాలా బాధగా అనిపించింది. పాపం ఇంకెవ్వరు లేనట్టున్నారు తనకి..ఏం చెప్పి ఒదార్చగలను?..ఆటోప్సి గూర్చి గుర్తుంది..ఆవిడని కదల్చటం ఇష్టం లేక ఊరకున్నాను. ఇంతలో వాళ్ళలో ఒకాయన వచ్చి బాడీని తీసుకువెళ్తాం అని అడిగాడు. ఆ అబ్బాయికి తాత అంట.
“చూడండి..మనిషి చనిపోయాక కొన్ని పద్ధతులు ఉంటాయి..మీరు ఒప్పుకుంటే..”
“ఆడి పేనమే పొయ్యాక ఇంకేం ఉంటాయ్ సారు..”
“అదే.. పోస్ట్ మొర్టెం అంటారు..అది చేసి మీకు అతని శరీరాన్ని అప్పగిస్తాము..”
“గంటె ఏం జేస్తరు..మల్ల బతుకుతడా?” కంగారు పడుతున్నాడు.
“అతను మళ్లీ బ్రతకడు అండి..” వీళ్ళకి ఎలా చెప్పాలో అర్ధం కావటంలేదు..”ఎందుకు చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు..ఇవన్ని చూసి మీకు అతని డెత్ సర్టిఫికేట్ ఇస్తాము..”
ఏం అర్ధం అయ్యిందో ఏంటో..వెళ్ళిపోయాడు..ఏడుస్తున్న వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు..
ఏడుపు ఆపి కాసేపు మాట్లాడుకుని ఆటోప్సి చెయ్యమని చెప్పారు. బాడీని తీస్కుని ల్యాబ్ కెళ్ళాను. పాథోలోజి ఆయన ఒకరు వచ్చారు. మొదలుపెట్టారు.
*****
ఆటోప్సి రిజల్ట్స్ వచ్చాయి. అవి చూసి నేను ఖంగుతిన్నాను.
“ఎలా చనిపోయాడు అని వాళ్ళు అంటున్నారు?”పాథోలోజిస్ట్ ప్రశ్న.
“తల మీదకి పైకప్పు కూలింది అంటున్నారండి. అప్పుడు స్కల్ బోన్ విరిగింది. అందుకే చనిపోయాడు అని అనుకున్నాము..ఇప్పుడేమో ఇలా..”
“మీతో ఉన్న సీనియర్ డాక్టర్ ఎవరు?ఆయనకి చెప్పండి ముందు..తర్వాత పోలీసుల్ని పిలిచి వీళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి..ఇలాంటివి కొన్ని సార్లు జరుగుతుంటాయి..”
“ఓకే సర్..”
రిజల్ట్స్ ప్రకారం అతనికి severe bilateral papilledema ఉంది..కాని వాళ్ళు చెప్పినదాని ప్రకారం అతను సౌండ్ అండ్ హెల్తి. వాళ్ళు తీస్కున్న మెడికల్ ఇన్సురన్స్ కి ఇతను అనర్హుడు. ముందు డాక్టర్కి లంచం ఇచ్చి మేనేజ్ చేసినట్టున్నారు..ఇతను ఆరోగ్యవంతుడు అని రాయించారు. ఇప్పుడు నేను వెళ్లి మా సీనియర్ డాక్టర్కి చెప్పినా మళ్లీ అదే జరుగుతుంది..ఈయన కూడా తన రేట్ చెప్పి మళ్లీ కేసు మార్చి రాస్తాడు. అలా జరగకూడదు అనుకున్నాను. వాళ్లనే మారుద్దాం, చదువుకున్న వాళ్ళు కాదు కదా, చెప్తే వెంటనే వింటారు,సులువు అనుకుని వెళ్ళాను. వాళ్ళ అమ్మ దూరంగా కుర్చుని ఏడుస్తోంది. పాపం ఆమెకి తెలీదు అనుకుంట ఈ రోగం ఉందని. అనుకునట్టే ఈ సారి కూడా మార్చి రాయమని , కావాలంటే అతని కోసం ఇచ్చే డబ్బుల్లో వాటా తీస్కోమని చెప్పారు. వీళ్ళకి  కాస్త హితబోధ చేద్దామనుకుని అలా చెయ్యటం తప్పు అని చెప్పాను. చాలా వాగ్వివాదం జరిగింది.
“నీకేంటి? మా బిడ్డ..మాకు తెలవదు అనుకున్నావు ఆడికి రోగం ఉందని? తెల్సిన ఎందుకు పన్లోకి పంపినం? పైసల కోసం గాదు..?”
“మీరెన్ని అయినా చెప్పండి..అలా చెయ్యటం తప్పు..” కాస్త  కఠినంగా చెప్పాను.
“పైసల్ ఇస్తం అంటే నీకేం చేదు..”
“పోలీసులకి చెప్తాను జాగ్రత్త!” ఇప్పుడు తగ్గుతారు అనుకున్నాను..కాసేపు ఊరుకున్నారు..
ఇంతలో నాతో మాట్లాడిన పెద్ద మనిషి వచ్చాడు..”ఇగో..ఆడి మీద ఇంటికప్పు పడలే..మేమే నెత్తి మీద బండ ఎష్నము ..మాకు పైసల్ కావలె..నీకు కూడా కావాలంటే తీస్కో..గంతే గాని మా కడుపుల్ గొట్టకు..”
నాకు మాట పడిపోయింది…చుట్టు పక్కల చూసాను. అక్కడి నుండి వెళ్ళిపోదాం అనిపించింది. నిజంగానే వెళ్లి పోలీసులకి చెప్పేద్దామా అనుకున్నాను..నన్ను,నా వాళ్ళని ఎమన్నా చేస్తే??
అనవసరంగా తల దూర్చాను అనిపించింది. వాళ్ళు కూడా నన్ను చూసి పోలీసులకి చెప్పేస్తానేమో అని బెదిరినట్టున్నారు..
“సూడు బిడ్డా..ఆడి రోగానికి పెట్టనికి మా కాడ పైసల్ లేవు..ఆడు చస్తే గా మేష్ట్రి పైసల్ ఇస్తడు. గందుకే గాన్ని జంపినం. ఏరే దారి లేకుండే..మేము శాన బీదోల్లం. తిననికి కూడా లేక 2 -3 నెలలు మాడినం. ఆడి చెల్లి పెళ్లికి మస్తు డబ్బులైతై. ఏడికెల్లి తెస్తం?గేట్లైన ఆడు సావనికే పుట్టిండు..గదేదో మాకు సాయం ఐతదని గిట్ల జేష్నం.”
కాసేపు అయ్యాక మళ్లీ ఆయనే చెప్పటం మొదలుపెట్టాడు  “గయినా సచ్చుడు ఆనికి కూడా ఇష్టమే. ఆడు చెప్పిండనే సంపినం. ఇంక జబ్బు ముదిరినాది..పన్లోకి పోలేను..రేపటి సంది ఇంట్లనే పండాలి..నన్ను ఇయ్యలె సంపు తాతా అంటే కడుపుంత ఎడ్షిన. అమ్మకి తెల్వనీకు,అది కూడా నాతొ సస్తది, నువ్వే చెప్పు అని బిడ్డ అంటుంటే నాకే సావు రానందుకు దేవుణ్ణి తిట్టిన. ఆడు సంపు, సంపు అని నన్ను మాటల్తో సంపుతుంటే నేనే బండ లెక్క మారి ఆడి నెత్తి మీద బండ వెట్టి కొట్టిన. ఎత్తి తిప్పిన సేతుల్తోనే ఎత్తి కుదేసిన. ఆడు మామూలుగా జస్తే పైసల్ రావు. గిట్ల పన్ల జస్తేనే ఒస్తయ్. గా పిల్ల మొకం జూసి అయిన మార్చి రాయి బిడ్డా..నీ కట్టం ఉంచుకోము..”
దేవుడా..ఇదో రకం mercy killing ..ఏం చెయ్యాలో నాకు అర్ధం కాలేదు..వీళ్ళు అసలు నిజమే చెప్తున్నారా? మరీ పిల్లల్ని చంపుతారా లేకపోతే? అంత ప్రేమ లేనివాళ్ళే అయితే ఆ ఆడపిల్ల కోసమే చంపాము అంటున్నారే..అది మాత్రం పిల్లల మీద ప్రేమ కాదూ? మరి అంత ప్రేమ ఉన్న వాళ్ళే అయితే మరి వీడ్ని ఎట్లా చంపగలిగారు? పిల్లాడికి రోగం ఉందని చంపేసుకుంటారా?  అంత వైద్యం చేయించలేకపోతే వాడి చావు వాణ్ణి చావనీయచ్చు కదా?
నా బుర్రలో ఏదో సుడిగుండం మొదలు ఐపోయింది..కాసేపటికి సీనియర్ వచ్చారు..ఆయన రాకపోతే ఈ ఆలోచనలతో నేను చచ్చిపోయి ఉండేవాణ్ణి.
“ఏంటి అరుణ్…ఎనీ ప్రాబ్లం?”
పక్కకి తీస్కెళ్ళి మొత్తం చెప్పాను..
“పాపం వాళ్ళ మొహం చూస్తుంటే జాలి వెయ్యట్లేదా అరుణ్ నీకు? మార్చి రాసేద్దాం..వాళ్ళకి ఉపయోగపడే పనే కదా మనం చేస్తున్నది..!ఆ సర్టిఫికేట్ పని,అది కూడా కొంచం తొందరగా చేసేద్దాము”
“పాపం పిల్లాడ్ని అన్యాయంగా చంపేసారు కదా సర్..”
“వాళ్ళ పిల్లాడు, వాళ్ళ ఇష్టం..”
“మీరే అలా అంటే ఎలా సర్..మీరు ఈ mercy killing ని సపోర్ట్ చేస్తున్నారా? మనం చట్టం ఒప్పుకోదు కదా? “
“అరుణ్, దీన్ని voluntary active euthanasia అంటారు..మన దేశం లో లేదు కానీ బెల్జియం, నెదర్ లాండ్స్ లాంటి దేశాల్లో voluntary euthanasia లీగలె. వాళ్ళ ఆర్దిక పరిస్థితికి వాళ్ళు ఇంక చెయ్యగల్గింది ఏం లేదు..ఆ బిడ్డ బ్రతకడు..బ్రతికే దాక వైద్యం చేయించే స్థోమత వాళ్ళకి  లేదు..అతను సాధారణ చావు చస్తే ఆ ఇన్సురన్స్ వాడు డబ్బులు ఇవ్వడు..అందుకు ఇంక తప్పక ఇలా చేశారు”
“అసలు ఎలా నమ్ముతున్నారు సర్ మీరు..వాళ్ళు వేరే స్వార్ధానికి చంపేసి ఉంటే? పోనీ నిజమే అయినా కూడా అసలు ఇది ఇలా వదిలేస్తే రేపటి నుండి ఇలాంటివి ఇంకెన్ని చావులు చూడాలి మనం?”
“ఆవేశపడకు అరుణ్..మన దేశంలో ఎన్ని కేవలం ఒకరి స్వార్ధానికి జరగట్లేదు? వీళ్ళు పేద వాళ్ళు..దీని వాళ్ళ లాభపడుతున్నారు..మనం సాయం చేస్తే ఆదుకున్న వాళ్ళం అవుతాము..వాళ్ళకి లాభము..మనకి పుణ్యము..”
“సర్..” నేను ఆశ్చర్యపోయాను..ఇందులో మళ్లీ సమాజ సేవా?!
“తప్పేముంది చెప్పు..వాళ్ళ  బిడ్డే కదా..పోషించలేకే కదా చంపుకున్నారు. ఇందులో పగలు, ప్రతీకారాలు ఏం లేవు..వాళ్ళ పేదరికం అలా చేయించింది..దీని వాళ్ళ మిగిలే ఖర్చు, వచ్చే డబ్బులు వాళ్ళకి ఊరట..అసలు నన్ను అడిగితే మన దేశంలో కూడా ఇది లీగల్ చెయ్యలయ్యా. డాక్టర్, పోలీసుల ఆద్వర్యంలో ఈ ప్రక్రియ జరిగేందుకు అనుమతి నివ్వాలి..అసలు మొన్న అరుణ కేసులో passive euthanasia కి అనుమతి ఇచ్చింది కదా మన ప్రభుత్వం? వీళ్ళ కేసులో అది కూడా కష్టం కాబట్టి active euthanasia చేస్తున్నాం మనం. కాకపోతే చట్టం మనమే అయ్యి చేస్తున్నాం అంతే..” నవ్వేసాడు ఆయన.
“ఈ అబ్బాయి ఆ అరుణ లాగా ‘vegetable ‘  కాదు సర్..రోజూ పనిలోకి వెళ్ళే అబ్బాయి..పైగా వీళ్ళు నిజమే చెప్తున్నారు అని నమ్మకం లేదు కదా!”
“అరుణ్..కొంచం సేపు మనసుతో ఆలోచించు..ఏం అనిపించకపోతే నేను చెప్పింది చేసెయ్యి..నేను వెళ్ళాలి..” ఆయన వెళ్ళిపోయాడు. మరి నా ప్రశ్నలకి సమాధానం చెప్పలేకో,ఏమో నాకు అసలు మనసే లేదు అనుకున్నాడు. నాకెందుకులే అని నేను సరిపెట్టుకున్నాను. వెళ్లి సర్టిఫికేట్ వాళ్ళకి కావల్సినట్టే ఇస్తాము అని చెప్పాను. వాళ్ళు ఆనందంతో నా కాళ్ళు పట్టుకున్నారు. ఆ పెద్ద మనిషి దణ్ణం పెట్టి నేను దేవుడిని అన్నాడు. ఇంతలో ఆ పిల్లాడి శవం తీస్కోచ్చారు. ఈ సారి నిజమైన కన్నీరు కారుస్తున్నారు అందరు.  వాడి నొసటి మీద ముద్దు పెట్టుకుని దెగ్గరికి తీస్కున్నాడు వాళ్ళ తాత. ఆ కళ్ళలోంచి ప్రేమ కట్టలు తెంచుకుని ధార లాగా కారుతోంది.

§ 16 Responses to ఆటోప్సి!

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

What’s this?

You are currently reading ఆటోప్సి! at ఓ "గాలి" కబుర్లు:).

meta

Follow

Get every new post delivered to your Inbox.