బాపు-రమణ
జూన్ 8th, 2011 § అభిప్రాయములు
“పద్మ” పురస్కారాలు మూడు – పద్మవిభూషణ్ , పద్మభూషణ్ మరియు పద్మశ్రీ. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారతరత్న పురస్కారం తర్వాత వీటిని ఇస్తారు. కళలు, సాహిత్యం, విజ్ఞానం, క్రీడలు, వైద్యం, సామజిక సేవ, పరిశ్రమ, విద్య-ఆయా రంగాల్లో ప్రతిభావంతులకి ఈ పురస్కారాలు ఇస్తారు. కొన్ని సార్లు ఇవి నిజంగా ప్రతిభావంతులు అందరికీ అందుతున్నాయా? అని సందేహం కలుగుతుంది. ఇదేమి ఈ మధ్యే జరిగిన విషయం కాదు. కాని ముమ్మాటికి చర్చనీయమే.
తెలుగు సాహిత్యంలో ముళ్ళపూడి వెంకట రమణ గారికి ఉన్న కీర్తి అసమానమైనది. కుటుంబీకుల మధ్య సంబంధాలు, సామాజిక నైతిక విలువల గొప్పతనాన్ని హృద్యమైన సంభాషణలతో ఆయన రాసిన ప్రతీ కథ ఆయన గొప్పతనానికి ఒక మచ్చుతునక. తెలుగు సాహిత్యం చదివే ప్రతివారు “బుడుగు” అల్లరి చేష్టలు చదివి నవ్వుకునే ఉంటారు. ఇక ఆయన తెలుగు సినిమాలకి రాసిన కథలు ఎంత రమ్యంగా ఉంటాయో చెప్పనవసరంలేదు. అలాగే తెలుగులో హాస్యం గూర్చి ఒక వ్యాసం రాయమంటే రమణగారి ప్రస్తావన లేకుండా ఎవ్వరూ రాయలేరు అంటే అతిశయం ఏమి లేదు కదా!
రమణ అంటే వెంటనే స్పురించే పేరు బాపు. చిత్రలేఖనంలో బాపు కంటూ ఒక సామ్రాజ్యమే ఉంది. “అందమైన తెలుగు ఆడపిల్ల అంటే బాపు బొమ్మలా ఉంటుంది” అని చెప్పుకుంటారు. దీని బట్టి ఆయన గీతలకు ఉన్న అందం ఊహించుకోవచ్చు. పడుచు అమ్మాయి ఎన్ని హొయలు పోతుందో ఆయన బొమ్మలలో తెలుస్తుంది. ఇక ఆయన గీసిన రామాయణంలోని ఘట్టాల బొమ్మల గూర్చి ఎంత చెప్పుకున్నా చాలదు ఏమో. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థాన చిత్రకారునిగా పని చేసిన ఆయన కొన్ని అన్నమాచార్య కీర్తనలకు దృశ్య రూపం ఇచ్చారుట. తెలుగు పదాలు రాయటంలో కూడా తనదైన అందమైన శైలి ఉంది బాపు గీతలలో. 

చిత్రమైనది ఏమిటంటే బాపు-రమణ ద్వయం ఎంత కీర్తి గడించినా వారిని “పద్మ” వరించలేదు. అవి వస్తే తప్ప వీళ్ళు గొప్పవాళ్ళు కానట్టా? అని అడిగే వాళ్ళకి ఇచ్చే సమాధానం ఒక్కటే. ఈ పురస్కారాలు అవి అందుకున్న వారి ప్రతిభకు కొలమానం మాత్రం కావని నేను నమ్ముతాను. భారతరత్న మధురై షణ్ముఖవాడివు సుబ్బులక్ష్మిగారు పాడిన సుప్రభాతంతో కనీసం ౩౦% భారతీయుల దినచర్య మొదలవుతుంది. భారత రత్న లతా మంగేష్కర్ పాడిన “యే మేరె వతన్ కె లోగో” పాట విని నెహ్రు కళ్ళు చెమర్చాయి. హిందీ సినిమా సంగీతం వినే ప్రతీ వారికి ఆవిడ పాటలంటే ఇష్టమే. ఇంత కంటే ఆవిడకి పెద్ద బహుమతి ఉందా? అలాగే తెలుగు సాహిత్య, చిత్రరంగాలలో సృజనాత్మకతకు బాపు-రమణ దిగ్గజాలు అని ఆంధ్రులందరూ నిస్సందేహంగా నమ్ముతారు. ఎటొచ్చీ తతిమ్మా రంగాలలో విరివిగా పురస్కారాలు కుమ్మరిస్తున్న ప్రభుత్వం ౮౦ ఏళ్ళ వయసుకల వీరిని గుర్తించలేనంత కళ్ళు మూసుకుందా అన్నదే నా ప్రశ్న!
(గమనిక: ముళ్ళపూడి గారు ఈ ఏడాదిలోనే గతించారు) .
(బాపు బొమ్మల ప్రదర్శన కావూరి హిల్స్ లో జరుగుతోంది.దాని గూర్చి పత్రికలో చదివి ఆవేశంతో రాసిన ఈ వ్యాసం.)
(పైన బొమ్మలకి కాపి rights ఉండి ఉల్లంఘించినట్లు అయితే దయచేసి క్షమించగలరు.)
మాస్టారూ ఏదో కొద్దిగా తేడా కనిపిస్తోంది. ముళ్ళపూడి వెంకటరమణ గారిగురించి వ్రాసిందంతా నిర్వివాదాంశం. కానీ ” ఆయన రాసిన ప్రతీ కథ ఆయన గొప్పతనానికి ఒక మచ్చుతునక. “మిథునం” అంటే కథాసంపుటిలో “బంగారు మురుగు” మరియు “వరహాల బావి” అని రెండు కథలు ” ఏమిటీ? ఈ కథలు వ్రాసింది శ్రీరమణ గారు! ముళ్ళపూడి వారు కాదనుకుంటాను. కొద్దిగా చెక్ చేసికుంటే బాగుండేదేమో ?
భమిడిపాటి గారూ,
క్షమించాలి. ఇది వరకు ఇద్దరు వేరు అనుకుంటే నా స్నేహితులు ఒకరు ఆ రమణ, ఈ రమణ ఒక్కరే అని చెప్పారు. అందుకే సరిచేయవలసి వచ్చింది. వెంటనే మారుస్తాను. తెలియపరిచినందుకు ఎంతో కృతఙ్ఞతలు.
మీ వ్యాఖ్య రెండు సార్లు వచ్చింది. అందుకే ఒకటి తొలగిస్తున్నాను. గమనించగలరు.
నేను మాస్టారుని కాను.అమ్మాయిని
అమ్మాయీ! రమణ గారిని, శ్రీరమణ గారిని ఒకటి చేసేసావా? తప్పు కదూ!
తప్పు ఐపోయింది అధ్యక్షా! క్షమించెయ్యండి..
మాస్టారూ అని తప్పు వ్రాసేననే, రెండో వ్యాఖ్య పెట్టాను! మీరేమో నన్ను వీధిన పెట్టడానికి, రెండో వ్యాఖ్య తొలగించి, మొదటిది ఉంచేశారు ! ఎంతైనా వయస్సులో పెద్దవాడినిగదా, ఇలాటి తప్పులు దొర్లుతూంటాయి !
అమ్మాయీ! ఆంధ్రదేశంలో రమణులు ఎందరు కలరో “రమణ”లు అందరు కలరు. జాగ్రత్త సుమీ!!
నిరుడు సైఫలీఖానుకి భారతప్రభుత్వము పద్మశ్రీ తొడిగింది. దాంతో మనము ప్రభుత్వ పురస్కారాల బరువు బేరీజు వేసుకోవచ్చు…