ఏదో సరదాకి..

సెప్టెంబరు 9th, 2011 § అభిప్రాయములు

“బాబూ..ఏ ఊరు వెళ్తున్నావు?” నన్నే ఎవరో అడిగారు.’అసలే కోతి. పైగా కల్లు తాగింది’ అన్నట్లు నేను అసలే తిక్క గాడ్ని. పైగా సాఫ్ట్వేర్ వెధవని. పైగా మళ్లీ మాంద్యం అంటున్నారు. పైగా పెళ్లి కూడా కాలేదు.విజయవాడ నాన్స్టాప్ లో నా పక్కన కూర్చున్న ముసలావిడ నన్ను ఆ ప్రశ్న అడిగితె నాకు తిక్క రేగింది. నాకు ఇప్పుడు క్విజ్ లో పాల్గొనే మూడ్ లేదని ఆవిడతో గట్టిగా పీక నొక్కి వక్కాణించి చెప్పాలనిపించింది. కాని నేను మర్యాద రామన్నని కాబట్టి “విజయవాడ” అని చెప్పాను.
“ఎక్కడ ఏమిటి విజయవాడలో?”
“పటమట”
“ఉద్యోగం చేస్తున్నావా? చదువా?”
“హైదరాబాదులో X అనే ఒక సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా ఉద్యోగం చేస్తున్నాను. దాని హెడ్క్వాటర్స్ అమెరికాలో ఉంది. శనాదివారాలు సెలవులు కాబట్టి ఇవ్వాళ కూడా సెలవు పెట్టి విజయవాడలో ఉన్న మా తల్లితండ్రుల దగ్గరికి వాళ్ళని చూద్దామని వెళ్తున్నాను. సోమవారం మళ్ళి తిరిగి వచ్చేస్తాను.” ఇంకేం అడుగుతుందో అని మొత్తం ఒకేసారి చెప్పేసాను.
నాకు మొదటినుండి ప్రయాణంలో పక్కన వాళ్లతో మాట్లాడే అలవాటు లేదు. “ప్రయాణీకులకు విజ్ఞప్తి. అపరిచులతో జాగ్రత్త..పరిచయస్తులు నిలువుదోపిడీ చేస్తే మీ ఖర్మ.. రైల్లో కిరోసిన్,ఫినాయిల్,హిట్ లాంటివి తీస్కెళ్ళద్దు. టపాసులు, అగరొత్తులు వెలిగించద్దు” అనే రైల్వే నినాదం చాలా శ్రద్దగా పాటిస్తాను. అందుకే ఎవరితో మాట్లాడకుండా హైదరాబాద్ సిటి బస్సులలో అమ్మాయిల్లాగా చెవిలో ఐపాడ్, అందులోంచి బయటకి వినిపిస్తూ “ఓహ్ కళంకిత..కళలకే అంకిత.., మెట్టెల సవ్వడి…ఒహ్..మెట్టెల సవ్వడి..” లాంటి హిట్ సాంగ్స్ వింటూ ఉంటాను. అసలు ఇవ్వాళ నా కోపానికి కారణం ఇంకోటి ఉంది. నాకు ఈ ఏడాది కూడా పెళ్లి కాకపోతే మా నాన్న “ఈ పిల్లాడికి పెళ్లవుతుందా?” అని సినిమా తీస్తాడుట. అది నా ఒళ్ళు మండటానికి కారణం.
నా దెబ్బకి పక్కన కూర్చున్న ఆవిడ  కొంచం సేపు ఏం మాట్లాడలేదు. కాసేపటికి:
“మా మనవరాలు కూడా ట్రై చేస్తోంది. కాంపస్ లో అవ్వలేదు ట. విడిగా ఎమన్నా కుదురుతుంది ఏమిటి మీ కంపెనీ లో?”
“అయ్యో, తప్పకుండా బామ్మగారు. తన పేరు, గోత్రం, ౨ రీసెంట్ ఫోటోలు, జాతకం నా మెయిల్ కి పంపమనండి..మిగితావి నేను చూస్కుంటాను” అని అన్నాను.
“ఏమిటో సరిగ్గా వినపడలేదు బాబు..మరోసారి చెప్పు”
“అదే రేస్యుమే అని ఉంటుంది బామ్మగారు..నాకు పంపమనండి..నా అడ్రస్ మీకు ఇస్తాను..” అని పేపర్ మీద రాసిచ్చాను.
“నీకేం శ్రమ కాదు కదా?ఇలా ప్రయాణంలో పరిచయం అయ్యి అడుగుతున్నాను అని ఏం అనుకోకు…మా ఇందు చాలా తెలివైన పిల్ల..కాలేజీలో కూడా దాన్ని అందరు  చాకు,బాకు,బేకు,కత్తెర అనేవారు..ఏమిటో దాని దురదృష్టం..ఇంకా ఎక్కడ ఉద్యోగం దొరకలేదు..పిల్ల బాధ చూడలేకపోతున్నాం అనుకో..”
“మీరు మరీనండి..ఇందులో శ్రమ ఏం ఉంది..అయినా ప్రయాణీకులన్నాక ఆ మాత్రం సాయం చేస్కోకపోతే ఎలా చెప్పండి..నాకెందుకో మొదటినుండీ తోటి ప్రయాణీకులతో స్నేహంగా ఉండటం అలవాటు..”
“నువ్వు చాలా మంచి వాడిలా ఉన్నావు”
“కరెక్ట్ గా కాచ్ చేసారు.”
ఈలోగా మా బస్సు వాడు అత్యంత శక్తివంతమైన శక్తి సినిమా మొదలుపెట్టాడు. జూనియర్ ఎన్టీయార్ హిందీ మాట్లాడుతుంటే ఉదిత్ నారాయణ్ తెలుగులో పాట పాడుతున్నట్టు సొంపుగా ఉంది. అయిన ఏ సినిమా ఏస్తే నాకేంటి? నా ఇందు కూడా ఇల్లూ అంత అందంగా ఉండి ఉంటుంది అని కలలు కనసాగాను.
“అవును నిన్ను అమెరికా  పంపారా బాబు?”
అదేమిటో నాకు అర్ధం కాదు. సాఫ్ట్ వేర్ వాడు అన్నాక ఖచ్చితంగా అమెరికా వెళ్ళాలి అని, అక్కడ నయాగరా ఫాల్స్ దెగ్గరో, ఎవరిదో లిమో పక్కన నిలబడో చింతకాయల రవిలో వెంకటేష్ లాగ ఫోటోలు దిగాలని, అవే తెలుగు మాట్రిమనీలో పెట్టాలి అని ఎవరు రూల్ పెట్టారో కాని, ముందు వాణ్ణి వేసేయ్యాలి. అక్కడ శనాదివారాలు కూడా పని చేసి శోష వచ్చి ,వాడిచ్చిన డీఏ సరిపోక రాత్రి పస్తులున్నా సరే..అమెరికా వెళ్తేనే గొప్ప! అక్కడ తిరిగితేనే గొప్ప! అక్కడనుండి గిఫ్ట్స్ తెస్తేనే గొప్ప! నన్నేమో ఈ మాయదారి కంపెనీ ఇంకా పంపనే లేదు. కోటి అబద్దాలు ఆడి అయినా ఒక కోడలిని తెమ్మన్నారు పెద్దలు..అందుకే..
“ఆ వెళ్ళాను బామ్మగారు..మూడు సార్లు వెళ్ళాను..చాలా  దేశాలు తిరిగాను లెండి ఆ మాటకొస్తే..అందుకే మా వాళ్ళు అంటూ ఉంటారు నిన్ను ఎవరు చేస్కుంటారో కానీ..” నరకటం మొదలుపెట్టాను..
“ఇంకేం దేశాలు తిరిగావేంటి?” మధ్యలోనే నా వాక్ప్రవాహం ఆపి ప్రశ్నించింది…
“అమెరికా, రష్యా, జర్మనీ, స్వీడన్, మాల్దీవ్స్, సోమాలియా, సూడాన్” ఒకసారి వరల్డ్ మ్యాప్ మెదడులో వేస్కుని శక్తిలో ఇల్లూ లాగా ఏది బడితే అది చెప్పా.
“మంచిది బాబూ..అయితే అక్కడ చేరితే బానే తిరగచ్చు అన్నమాట. సెలవలు ఉంటాయా బాబూ?”
గాడిద చాకిరి చేయించుకుంటూ నెలాఖరికి డబ్బులు పడేస్తారు మా మోహాన పిల్లాడ్ని గిల్లి నోట్లో చాక్లేట్ పెట్టినట్టు. తెలంగాణ అని, వానలు సరిగ్గా పడట్లేదు అని, రాఖి సావంత్ పెళ్లయిపోయిందని,బందులు ఎక్కువైపోయాయని  ఊర్లో బందులు జరుగుంటే మమ్మల్ని మటుకు కూర్చోపెట్టి పని చేయిస్తారు.
మళ్ళీ ‘నాతూ పెళ్ళాం తావాలి’ కాబట్టి “ఓహ్ ఉంటాయి బామ్మగారు. కావలసినన్ని ఉంటాయి” అని చెప్పాను.
“జీతం అది బానే ఉంటుందా?”
“భలే వారే మీరు…సాఫ్ట్ వేర్ అంటే మాటలా.మొన్నే ఒక ఇల్లు, కారు, ఇంట్లోకి సామాను కొన్నాను.” ఇక మీ ఇందు అందులో అడుగుపెట్టటమే ఆలస్యం అన్నట్టు చెప్పాను.
“అదృష్టవంతుడివి బాబు.మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్కోవటమే ఇంక మిగిలింది” అందామె నవ్వుతూ.
“అదే చూస్తున్నారు అండి ఇంట్లో” అని చెప్పాను సిగ్గు లేకుండా సిగ్గు నటిస్తూ..
“మా ఇందుకి కూడా చూస్తున్నాం బాబూ” అంది ఆవిడ. అలా అని నన్ను పైనుండి కిందకి చూడటం మొదలుపెట్టింది..ఛ!ఇదే ట్రైన్ అయ్యుంటే వెంకిలో రవితేజ లాగ వాష్ బసిన్ దెగ్గరికి వెళ్ళి గబ్బుకున్న పెళ్లి చూపులుంటే పనికొస్తుందని నా బ్యాగ్లో పెట్టుకున్న ఎవెర్యూత్ ఫేషియల్ చేస్కుని వచ్చేవాడని. బస్సు అవ్వటంతో పొట్ట లోపలకి పెట్టి, కళ్ళు బయటకి పెట్టి, బుర్ర పక్కకి పెట్టి ఏవేవో ట్రై చేశాను. బామ్మ మొహం చూస్తె నేను నచ్చినట్టే ఉన్నాను. తనేందుకో మురారిలో పెళ్లి పాట ఊహించుకుంటోంది అని నా ప్రగాఢ నమ్మకం.
విజయవాడ వచ్చేసింది. నా ఇందుని చూసే టైం వచ్చేసింది. నాలో ఏదో తెలీని ‘శక్తి’ ఉందని నాకనిపించింది. ఇంకాసేపు ఉంటె మగధీరలో రాంచరణ్ లాగ అక్కడ ఉన్న ఆడవాళ్ళు అందరినీ తాకి ఇందు, ఇందు అని అడిగేవాణ్ణి. నేను బామ్మ వెనకాలే కొరివి దయ్యంలా వెళ్తున్నాను. ఇంతలో “బామ్మా” అని వెనక నుండి ఎవరో మగవాళ్ళ పిలుపు. కొంపదీసి ఇందు కాకుండా వాళ్ళ అన్నో,తమ్ముడో రాలేదు కదా అనుకున్నాను. ఈవిడ వెనక్కి తిరిగింది. నేను జాగ్రత్తగా అదే యాంగిల్ల్లో తిరిగాను. “ఇదే బాబు మా ఇందు” అంది ఆవిడ నా దీపం ఆర్పేస్తూ. అహ నా పెళ్ళంటలో నూతన్ ప్రసాద్లాగా మా అమ్మకు కావాల్సింది అల్లుడు కాదు..కోడలు..అని చెప్పేసి వెనక్కి వచ్చేసాను.

§ 8 Responses to ఏదో సరదాకి..

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

What’s this?

You are currently reading ఏదో సరదాకి.. at ఓ "గాలి" కబుర్లు:).

meta

Follow

Get every new post delivered to your Inbox.