తెలుగు వెలుగులో నా కొత్త కథ


asatyame-inupa-kavacham-615-x-403-2

చదువు వ్యాపారంగా మారిన కార్పోరేట్‌ యుగం. కూతురు చక్కగా చదువుకోవాలని హాస్టల్లో చేర్పించారు సౌమ్య తల్లిదండ్రులు. కానీ ఆత్మహత్య చేసుకుందని తెలిసి కుంగిపోయారు. ఆ కేసును ఛేదించాలని పోలీసు అధికారి చేసిన ప్రయత్నం ఫలించిందా?

కథ పూర్తిగా: అసత్యమే ఇనప కవచం

90లో రైలు ప్రయాణం


“అన్నీ వచ్చినట్టేనా?”
“మూడు పెట్టెలు..రెండు బ్యాగులు..వచ్చినట్టే”
“ఆ చైన్ అందుకో..తాళాలు వేసేస్తే ఒక పని అయిపోతుంది”
“చార్ట్ లో నీ పేరు ముందు మిస్టర్ అని వేసారు..అబ్బాయి వి అనుకుంటున్నారు నిన్ను..హహాహ“
“ఎక్కిరించింది చాలు.. పళ్ళు రాలిపోతాయ్”
“ఆహా..ఎలాగా?”
“పై బర్త్ నుండి కింద పడిపోతావ్ కాబట్టి..”
“నువ్వు తోసేస్తావా?”
“నువ్వే దోర్లేస్తావ్”
“నాన్నా..దీనికి చెప్పు…నాకు మిడిల్ బర్త్ కావాలి..”
“కుదరదు..పోయినసారి కూడా నువ్వే పడుకున్నావ్..నాన్నా ఈసారి నాకే కావాలి”
“కిటికీ సీట్ నీకే…మిడిల్ బర్త్ కూడా నీకేనా? ఇంకెందుకు నా బట్టలు, క్లిప్పులు, చెప్పులు అన్నీ తీసేస్కో”
“గొడవ వద్దు..ప్రస్తుతానికి ఒక చోట సర్దుకోండి..జనం ఎక్కుతున్నారు”

*

“అడిగి మీరు కూడా ఇక్కడికి మార్చుకోండి..ఒక్కదాన్నే పిల్లలతో నేనేం పడుకుంటాను?”
“అన్నాలు కూడా అయ్యాక పడుకునే టైం కి వెళతాను ..భయం ఏం ఉండదులే..ఫ్యామిలీస్ ఏ ఉన్నారు చుట్టుపక్కల”
“కలిసి ఉంటే ధైర్యం కదండి…అడిగి చూడండి ..మళ్ళీ పొద్దున్నే దిగెయ్యాలి ”
“మన దగ్గర ఎవరు ఎక్కుతారో చూద్దాం. అడుగుతాను..”
“48 మాది సర్.”
“రండి…అలా జరుగు చిన్నా..”
“పరవాలేదు. పిల్లల్ని కిటికీ దగ్గర కుర్చోనివ్వండి. నేను ఇక్కడ సర్దుకుంటాను. నేను ఎలాగూ బోగీలు మారుతూ ఉండాలి”
“అదేం సర్”
“మా అక్కయ్యకి చివరి నిమిషం లో కొన్నామా.. తనకి  S2 లో ఇచ్చారు. మా ఆవిడకి, నాకూ ఇక్కడ ఇచ్చారు. నేను వెళ్తూ, వస్తూ ఉంటాను“
“నాది కూడా అదే ప్రాబ్లం అండి. లీవ్ దొరుకుతుందో లేదో అని ముందు కొనలేదు. నాకు S4 లో ఇచ్చారు. టీసీ వస్తే అడిగి చూడాలి.”
“అబ్బే లాభం లేదండి. ఈ మాత్రం యాతన లేకుండా రైలు ప్రయాణాలు అవ్వటం లేదు..”

*railway-top-img1

“టమాటో సూప్.. “
“టీ..కాఫీ”
“నాన్నా నాకు సూప్ కావాలి..”
“అవి,ఇవి తింటే ఇక రాత్రి భోజనం సరిగ్గా చెయ్యరు”
“పర్లేదులే.. చిన్న సూపేగా?”

*

“టికెట్ సర్..”
“సర్ నాకు S4 లో ఇచ్చారు..ఫ్యామిలీ ఇక్కడ ఉంది..ఇక్కడికి మార్చే వీలు ఏమైనా ఉందా?”
“చూస్తా ..అయినా అందరూ అడిగితే మేము మాత్రం ఎక్కడినుండి సర్దేమండి?  ఈయన్ని అడిగి చూసారా ?”
“మా వాళ్ళే S2లో ఉన్నారు..కుదిరితే ఇక్కడికి మార్చాలి సర్..”
“సరిపోయింది”

*

“ఎక్కడా దిగేది మీరు? తిరుపతి ఏనా?”
“అవును సర్..మీరు?”
“మేము కూడా అక్కడికే.”

*

“పొట్లాలు ఎవరిది వాళ్ళకి అన్నట్టు కట్టాను.. తినేయ్యండి మీరు..ఎనిమిది అయింది”
“పిల్లలకి ఇచ్చేయ్ ముందు..”
“చిన్నా, దిగుతారా మీరిద్దరూ ? అన్నం తిందురు గాని”
“ఇక్కడే తింటాం అమ్మా”
“వెలుతురు ఉండేదాకే కిటికీ సరదా..తర్వాత అంతా పైన కుర్చుని గొంతులు వాచేదాకా కబుర్లు”
“పోన్లెమ్మా …మా మనవరాళ్ళు అయితే అది కొను, ఇది కొను అని వచ్చే,పోయే అందరి దగ్గర బోణి కొట్టిన్చేవాళ్ళు”
“వీళ్ళు కూడా ఏం తక్కువ కాదండీ. ప్లాట్ఫారం మీదే అయింది మాకు క్షవరం. ఇదిగో  పేక ముక్కలు తరవాత ఈ మూడు పుస్తకాలు ఎప్పుడూ  కొనాల్సిందే- చందమామ, టింకిల్, చంపక్. వాళ్ళ నుండి నాకు కూడా అలవాటు ఐపోయింది వీటి పఠనం.”

*

“లైట్లు 10దాకా ఉంచచ్చు..ఉంటాలే అప్పటిదాకా”
“పరవాలేదు సర్.. నేను కనిపెడుతూ ఉంటాలే..మీరు వెళ్ళిరండి”
“థాంక్స్ అండి..నేను లేచిన వెంటనే వస్తా..జాగ్రత్త మరి..”

*6cdca3fbae91651e36bdb66903948d27

“టీ.. కాఫీ.”
“ఒక కాఫీ. బండి లేట్ అయ్యిందా బాబూ?”
“అవును సర్..40 నిముషాలు లేట్”
“లేచావా? అరె! టీ వాడు ఇప్పుడే వెళ్లిపోయాడే? ఉండు చూసొస్తా”
“ఇంకొకడు వస్తాడులే..ఇక టీ,కాఫీల వేళ అయిందిగా”
“లేపకు పిల్లల్ని..ఎలాగూ ఆలస్యం అయింది..దిగేముందు లేపుదాం”
“ఎలా కూర్చుంటారు అలా? మెడ పట్టేయదూ? కింద పడుకోబెడతా వాళ్ళని”
“నాకేం పరవాలేదు.”

*

“మొహాలు కడిగేటట్లు అయితే ఇప్పుడే వెళ్తే బెటర్.. జనాలు లేస్తే ఇక రొచ్చు అయిపోతుంది”
“ఈనాడు..వార్త ..జ్యోతి..హిందు..”
“ఈనాడు,హిందు ఇవ్వు బాబూ “
“డిస్ట్రిక్ట్ అడిషన్ తీస్కోనా సర్..”
“తీస్కోండి”

*

“ఇదేమిటీ ఇక్కడ ఆపేసాడు ?”
“ఇదేమన్నా స్టేషనా ?”
“నాన్నా..తిరుపతి వచ్చిందా ?”
“ఇంకా గూడూరు కూడా రాలేదు..కనుక్కొస్తా ఉండు”
“లేదులే సిగ్నల్ పడినట్టుంది ..అదిగో కదిలాడు”maxresdefault

*

“దిగండి తిరుపతి వచ్చింది..చిన్నాలే ఇక”
“పూర్తిగా ఆగాక దిగండి..తొందరేం లేదు”
“అటు పదండి ఇటు జనాలు ఎక్కువగా ఉన్నారు..”
“అన్నీ తీస్కున్నావా …వెళ్లి ఒక్కసారి చూసిరాపో తల్లీ..”
“ఏం  లేవు నాన్నా..ఈ పేపర్ తప్ప ..”
“రైట్!”

Featured image credits: Bijaya Biswal, Train Ticket Examiner in Nagpur division of the Indian Railways.

కౌముది వారికి ధన్యవాదాలతో


నేను రచయిత్రిని కాదన్న వాళ్ళని రాయెత్తి కొట్టే సదవకాశం నాకిచ్చిన కౌముది వారికి ధన్యవాదాలతో:) 🙂

ఈ నెల కౌముదిలో అచ్చు అయిన నా కథ

Click to access may_2015_kadhakoumudi_2.pdf

కరువు -బరువు



“మీకో చిక్కు ప్రశ్న వేస్తాను..మీరు కరెక్ట్ గా చెప్తే మీకు నా తరఫున నుండి ఒక బ్రహ్మాండమైన గిఫ్ట్ ఉంటుంది..” అంది మా ఆవిడ టీవీలో యాంకర్ లాగ వయ్యారాలు పోతూ.
“నీ గిఫ్ట్ ఏం అక్కర్లేదు కాని ప్రశ్న ఏమిటి?”
“​వీరిలో భారతదేశపు మహిళా రాష్ట్రపతి ఎవరు? అ) శ్రీమతి ప్రతిభ పాటిల్ ఆ)అటల్ బిహారీ వాజ్ పేయి “
“​ఇదేమి ప్రశ్నే! వాజ్ పేయి అసలు మహిళ కాదు. రాష్ట్రపతి కానే కాదు. ఇలాంటి ఆప్షన్స్ ఇస్తే ఎవరైనా చెప్పేస్తారు!”
“మీకేం తెలియదు..ఇలానే అడగాలి..నేను ఇంకా మిమ్మల్ని తికమక పెట్టేస్తా అనుకుని తెగ సంబరపడిపోయాను. మీరు చాలా తెలివైన వారండి ఎంతైనా..”
“సంతోషించాంలే గాని ఇవ్వాళ వంట ఏమిటి?”
“ఆంటిపాస్తో” అండి మా ఆవిడ గంభీరంగా మొహం పెట్టి..
నేను కంగారుపడి ఎవరన్నా వచ్చారేమో అని లేచి నిలబడ్డాను. చూస్తే ఎవరు లేరు..
“ఎవరే వచ్చింది?”
“ఎవరు రావాలి?”
“ఎవరో ఆంటీ అన్నావు?”
“మీ మొహం..ఆంటిపాస్తో అన్నది ఇటాలియన్ వంటకం.”
“బాబోయి..అది తింటే నాకు కూడా చంటబ్బాయిలో ఎడిటర్కి ​మల్లే ​జ్ఞానోదయం అవ్వదు కదా?”
“మీరు మరీ ​ అండి ​..ఇది ఇవ్వాళ టీవీలో చూపించారు..లో ఫాట్ వంటకం అంట..పైగా చెయ్యటం కూడా చాలా సులువు..ఉట్టి కూరగాయలు కోసేసి పైన ఒక సాస్ పొయ్యటమే”
“అంటే సలాడ్ అన్నమాట..”
“మీకు తెల్సిన భాషలో అదే..”
“సలాడ్ అంటే నేను తినను అని..ఆంటీ అని చెప్పి టెంప్ట్ చేద్దామనుకున్నావా?”
(నవ్వుతూ) “అలానే అనుకోండి..”
“నేను చస్తే తినను”
“ఎలా తినరో నేనూ చూస్తాను..మీరు మూడు కిలోలు బరువు ఎక్కువ ఉన్నారు..ఇలా అయితే మీ ఆరోగ్యం ఏం కాను? రేపటి నుండి పొద్దున్నే నాతొ వాకింగ్ కి కూడా వస్తున్నారు. తినేసి గమ్మున పడుకోకండి..అది అరిగేంతదాక కొంచం అటు,ఇటు బాల్కనీలో నడిచి లోపలకి రండి.” అనేసి ఆవిడ వెళ్ళిపోయింది.
“ఆ గడ్డి అరగటానికి కూడా నడవాలా?”
అటు నుండి ఏమి జవాబు లేదు. నా అర్ధాంగి మౌనంగా అర్ధ అంగీకారం ఇచ్చింది. మిగిలిన సగం నేను మౌనంగా ఇచ్చేశాను. అసలు ఒంట్లో ఏ మాత్రం ఓపిక ఉన్నా వాదించి ఏ వంకాయ్ కూరో చేయించుకుని తినేవాడిని. ఇప్పుడు ఏ మాత్రం తోక జాడించినా మా ఆవిడ ఆ రైతు బజార్ కూడా కట్టేస్తుంది ఏమో అని వెళ్లి టేబుల్ ముందు కూర్చున్నాను.
నేను అలిగితే ముందు అవతల వాళ్ళే మాట్లాడాలి..నేను నీళ్ళు కావాల్సి వచ్చినా వెళ్లి తెచ్చుకుంటానే తప్ప నోరు తెరిచి అడగను. మా ఆవిడ నాలా కాదు..వెరైటీ మనిషి. మా ఇద్దరిలో ఎవరు అలిగినా ముందు అవతల వాళ్ళే మాట్లాడాలి. లేదంటే నీళ్ళు ఇవ్వదు, దాహంతో ఉన్న మన ముందు కూర్చుని స్ప్రైట్, పెప్సి తాగుతుంది. మనమే చచ్చినట్టు మాట్లాడే పరిస్థితి కల్పిస్తుంది. అందుకే ఇలాంటి విషయాల్లో నేను పెద్ద వీరత్వం ప్రదర్శించను. సర్దుకుపోయి నేనే మాట్లాడేస్తాను.
“అవును.. ఎప్పుడూ లేనిది ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టావేంటి బరువు, లావు అని.. “
“మొన్న మేము మాట్లాడుకుంటుంటే మీనాక్షి వాళ్ళ ఆయన వచ్చారు. ఆయన నన్ను ఎంత మాట అన్నారో తెలుసా?”
విషయం బరువు గూర్చి అయినా మా ఆవిడ ఇచ్చినా బిల్డ్ అప్ చూస్తే నాకెందుకో అనరాని మాట అన్నాడేమో, ఈయనకేం పోయేకాలం వచ్చింది అనిపించింది.
” ఏంటమ్మా మీ ఆయనకి జీతం పెరిగింది అంట కదా..నిన్ను చూస్తుంటే తెలుస్తోంది అన్నారు.”
అసలు నాకు జీతం పెరిగింది అని మీనాక్షి గారికి మా ఆవిడే చెప్పింది. నా డెస్క్ మీద ఉన్న పేపర్ వెయిట్ విరిగిపోవటం నుండి నా ప్రమోషన్ పేపర్ పాస్ అవ్వటం వరకు అన్నీ విషయాలు నేను నీలుకి చెప్తాను. ఆవిడ అవి అక్షరం పొల్లు పోకుండా , వీలయితే మసాలాలు, అవి కూరి మీనాక్షి గారికి చెప్పేస్తుంది.
“నువ్వు నీ నగల దుకాణం అంతా చూపించటానికి అరుంధతిలో అనుష్కలాగా వెళ్లి ఉంటావు..” ఒళ్ళు మండి అన్నాను.
“అదేం కాదు..నేను కొంచం ఒళ్ళు వచ్చానుట. అలా అని చమత్కరించారుట. మీనాక్షితో నిజంగా పెరిగానా అని అంటే ఆవిడ ఏమందో తెలుసా..కాదు అనలేదు సరికదా మీరు ఇలానే ముద్దుగా ఉన్నారు అని మాట దాటేసింది.”
“వాళ్ళు నిన్నేం బూతులు తిట్టలేదు నీలూ..కొంచం బొద్దుగా అయ్యావు అన్నారు అంతే..”
“అంటే మీరు కూడా అదే మాట అంటున్నారా?”
“అలా అంటే నన్ను బతకనిస్తావా?”
“అంటే నేను ఊరకుంటే ఎంత మాట అయినా అనేస్తారు అన్నమాట..”
“అది కాదులే కాని..నువ్వు మానేస్తే మానేసావు..నాకెందుకు ఈ కుడితి?”
“మీరు కూడా లావు అయ్యారు..మీ పాత షేడెడ్ జీన్స్ మీకు పడుతుందా ఇప్పుడు?”
“ఇది మరీ బాగుంది..అది నేను పదో తరగతిలో వేస్కునే వాణ్ణి. నేను అది వేస్కోటం మానేసాక గోదావరికి రెండు పుష్కరాలు వచ్చాయి తెలుసా?ఇప్పుడు అది నాకు ఎలా పడుతుంది అసలు?”
“అదే మరి..నేను పట్టిస్తా..నేను చెప్పినట్టు చెయ్యండి..”
*************************
తెల్లవారింది..నాకు ఉద్యోగం వచ్చాక నేను కేవలం రెండు సార్లు సూర్యోదయం చూసుంటాను..ఒకటి ఉషాకిరణ్ మూవీస్ వాళ్ళ పాటలో..రెండు తత్కాల్ టికెట్లు బుక్ చేస్కోటానికి లేచినప్పుడు. మళ్లీ మా ఆవిడ పుణ్యమా అని ఇవ్వాళ చూసాను. ఇంతకీ తను ఎక్కడ ఉందా అని ఇల్లంతా కలియచూస్తుంటే సరికొత్త అవతారంలో ఎదురు అయ్యింది. కింద హాలీవుడ్లో కొన్న షూస్, పైన ట్రాక్ ప్యాంటు, దాని పైన సాఫ్ట్ జాకెట్, జుట్టుకి బ్యాండ్, చెవిలో ఐపాడ్. రోడ్డు పక్కన అమ్మే టెడ్డిబేర్ కి మల్లే ఉంది. నాకు నవ్వొచ్చినా నవ్వితే అది నా ఆరోగ్యానికే చేటు అని అణిచేస్కున్నాను. హైకమాండ్ ఆదేశాలు అందిన వెంటనే నేను కూడా తను చెప్పిన యూనిఫోరంలోకి మారిపోయాను. అల్సేషియన్ కుక్కని “ఉస్కో” అన్నట్టు తను నన్ను చూసి “పదండి” అంది. మా కాలనీ పార్క్లో మా జాగింగ్ ప్రస్థానం మొదలు అయ్యింది. కొంచం దూరం పరిగెత్తగానే మా ఆవిడ అలసిపోయి బెంచ్ మీద కూర్చుండిపోయింది.
“ఏమిటి..దీనికే ఆయసమా? మరీ సుకుమారివి నువ్వు.. “
తను వెంటనే ఒక్క క్షణం రోప్పటం ఆపేసింది. “మీరు ఎక్కిరించకండి.. రోజూ ఇంట్లో బండెడు చాకిరి చేస్తున్నాను..మీలా కూర్చుని తేరగా తినేసి పడుకోవట్లేదు..”నా మీద అస్త్రం సంధించేసి మళ్లీ రోప్పటం మొదలుపెట్టింది.అనవసరంగా కెలికాను అని మనసులో అనుకుంటూ తన పక్కనే చతికిలపడ్డాను.
“అసలు నీకో విషయం తెలుసా నీలూ..తగ్గాలి అనుకుంటే తినే తిండి, నువ్వు చేసే పనికి
​సమతుల్యం ఉండాలి. అంతే కానీ ఓ హైరానా పడిపోనక్కర్లేదు. కొంచం తిండి తగ్గించి, కాస్త వేగంగా వాకింగ్ చేశావే అనుకో..బ్రహ్మాండంగా తగ్గుతావు..”
” ​ఎంత సమయంలో​?”
“​ఎంత ..ఒక 5 -6 నెలల్లో..”
“5 -6 రోజుల్లో తగ్గే మార్గం ఏదన్నా ఉంటే చెప్పండి ప్లీజ్..”
“కష్టం..అలా అయితే మన అభిమాన హీరోల్లాగా నువ్వు కూడా ఆపరేషన్ చేయించుకోవాలి..”
“ఎంత అవుతుంది?”
“ఎంత అయితే నీకెందుకు?రూపాయికి చేస్తా అన్నా నేను పెట్టను..”
“మీరు అసలు నన్ను ఇష్టపడే పెళ్లిచేస్కున్నారా? ఏది అడిగితే అది కాదంటారు.. “
“అసలు నువ్వు ఇప్పుడు అర్జెంటుగా ఎందుకు తగ్గాలి?”
​”వచ్చే సోమవారం మన కాలనీకి ‘మా ఇంటి పెంట’ ప్రోగ్రాం వాళ్ళు వస్తున్నారు..”
“అబ్బా ఈ వంట ప్రోగ్రాం నా ప్రాణం మీదకి వచ్చిందే”
“ఇదే మీతో చిక్కు.. పోయిన​​ మార్చిలో మన కాలనీకి ‘మాయదారి అత్త..మాటకారి కోడలు’ ప్రోగ్రాం వాళ్ళు వచ్చారు .. అప్పుడు కూడా మీరు నన్ను వెళ్ళనివ్వలేదు”
“ఏమిటి ఎవరో ఒక అబ్బాయి జుట్టు మీద కారోప్పొడి జల్లుకుని వస్తాడు..ఎవరు తొందరగా తొక్కలు తీస్తారు.ఎవరు తక్కువ సమయంలో ఎక్కువ రాళ్లు ఏరుతారు? ఇలాంటి పోటీలు ఏవో పెడతారు..ఆ ప్రోగ్రాం ఏనా?”
“అదే.భలే బావుంటుంది కదా?”
“నీ తలకాయలా ఉంటుంది. ​అయినా ఆ మా ఇంటి పెంట గోల మనకెందుకు? కావాలంటే నిన్నా రోజు షాపింగ్ కి తీసుకువెళ్తాను.”
“అప్పుడెప్పుడో ‘వెధవయ్యారా’ ప్రోగ్రాం లైవ్ చూస్తుంటే ఇలాగే బజారు అని చెప్పి మన కాలనీలో చైనా బజారు కి తీసుకెళ్ళారు. అదేం కుదరదు. నేను ఈసారి టీవీలో కనిపించాల్సిందే.”
“​అదేం దిక్కుమాలిన ప్రోగ్రాము?”
“వెధవయ్యారా ప్రోగ్రాంలో యాంకర్ మనకి కాల్ చేసి వెధవా అనంగానే మనం అవును..చెప్పండి అనాలి. అప్పుడు మనం బహుమతులు గెల్చుకునే వాళ్ళం..”

funny telugu cartoon jokes5

source: teluguone.com

​”నువ్వు ఈ ఆటల పిచ్చిలో పడి మంచి ​కార్యక్రమాలు చూడట్లేదు నీలూ .. కాస్త నీ అభిరుచులు మార్చుకోవాలోయ్”
“మంచి కార్యక్రమాలా? ఏంటవి ?”
“పాత పాటలకి ధీటుగా అదే సందర్భానికి కొత్త తరం పాటలు ఎలా ఉంటున్నాయో చెప్పే కార్యక్రమం ఏదో రావాలే ?”
“నాడు-నేడు. అది మీ జీన్స్ లాగే పురాతన కాలం నాటిది. ఇప్పుడు రావటం లేదు”
” కొత్త గాయనీగాయకుల పాటల కార్యక్రమం ఏదో ఉండాలే?”
” ఉన్నది. పాటలు తక్కువ, తతిమ్మా వాళ్ళ బాదుడు ఎక్కువ. “
” ప్రముఖ వ్యక్తులతో ముఖాముఖీలు, వాళ్ళ జీవితానికి సంబంధించిన కార్యక్రమాలు..”
” వారిని కించ పరుస్తూ లేదా వారిని ఇబ్బంది పెడుతూ ప్రశ్నలు అడిగే కార్యక్రమాలు ఉన్నాయి.”
” మంచి సినిమాలు… మంచి ధారావాహికలు . . “
” మనం బయట చూసిన సినిమాలే మళ్లీ మళ్లీ మార్చి మార్చి వెయ్యటం తప్ప ఏనాడైనా ఒక మంచి పాత సినిమా వేస్తున్నారుటండి? మంచి ధారావాహికలా? ఏ కాలంలో ఉన్నారు?”
“వంటా ..వార్పు?” అనేసి నాలుక చర్చుకున్నాను.
“అడిగారూ ..ఆ మధ్య ఎప్పుడో పాలలో ఓట్స్ ఉడికించి దాన్ని పాయసం అని గంట సేపు ఏదో పెద్ద వంటకం అన్నట్టు చెప్పారు. అప్పుడు మీరే కదా నువ్వు కూడా వెళ్ళచ్చు కదే అని సలహా ఇచ్చారు? ఇప్పుడేమో వద్దంటున్నారు.. ” గోముగా అంది.
“అంటే మన టీవీలో చూడదగ్గ కార్యక్రమాలు ఏమీ రావాట్లేదా?” యాభై వేల టీవీని తలుచుకుంటూ అన్నాను.
“మనం చూడదగినవి అయితే ఇంతకు మించి ఏమీ లేవు.”
“​ఇంతకీ ఇప్పుడేం అంటావు ​?”
“నేను ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు నేను వంట చెయ్యవలసిందే. టీవీలో సన్నగా కనిపించవలసిందే.”
కార్యక్రమాల కరువు వల్లో, మా ఆవిడ అన్నట్టు ఒంట్లోని బరువు వల్లో తెలీదు.. భలే నీరసంగా అనిపించింది.

వెండితెర వేదికపై నాద వినోదం… నాట్య విలాసం


సినిమాలు మన మీద ప్రభావం చూపుతాయి అంటే నేను ఎప్పుడు నమ్మలేదు . స్వానుభవం అయితే తప్ప తెలీదు అన్నట్టు నన్ను మార్చిన అతి కొద్ది సినిమాల్లో సాగర సంగమం ఒకటి.

కళాతపస్వి

SSM-1

 

సాగర సంగమం చిత్రానికి 30 ఏళ్లు

ఓ సినిమా వెనకొచ్చే సినిమాలకు అనుసరణీయం, ఆచరణీయం అయితే… దాన్ని గొప్ప సినిమా అంటాం. అయితే… అనుసరణకు, ఆచరణకు సాధ్యం కాని గొప్ప సినిమాలు కూడా కొన్ని ఉంటాయి. అలాంటివి అరుదుగా వస్తుంటాయి. ఆ కోవకు చెందిన సినిమానే కె.విశ్వనాథ్ ‘సాగరసంగమం’. ఈ సినిమాను అనుసరించడం, అనుకరించడం, ఆచరించడం ఆ సాధ్యం. 
నదీమతల్లి సముద్రునిలో మమేకమవుతున్న దృశ్యం.. చూడటానికి ఎంత రమణీయంగా ఉంటుందో అంత రమణీయంగా ఉంటుందీ సినిమా. అందుకే దీనికి ‘సాగరసంగమం’ పేరు యాప్ట్. నిజానికి నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఈ సినిమాకు ఆ పేరు అనుకోలేదు. భారతీరాజా దర్శకత్వంలో తాను నిర్మించిన ‘సీతాకోకచిలుక’ చిత్రానికి ఈ పేరు అనుకున్నారు. కానీ దైవనిర్ణయం వేరేలా ఉంది. కాశీనాథుని విశ్వనాథుడు తెరకెక్కించనున్న అద్భుత కళాత్మకసృష్టి కోసం దైవం ఈ పేరు అప్పుడే రిజర్వ్ చేసేసింది. 

అసలు టపాను చూడండి 409 more words

రాతెలా మారిందంటే…


మీటలు నొక్కి నొక్కి వేళ్ళు అరిగిపోతున్నాయని ముట్టుకుంటే అక్షరాలు వచ్చేస్తున్న ఈ రోజుల్లో రాత గురించి పిచ్చి రాతలు అవసరమా? అని తీసి పారెయ్యకండి.

మీరు కొన్న/కొట్టేసిన పెన్ను ఏదైనా ఉంటే పేపర్ మీద మీ పేరు రాయండి. తెలుగు వచ్చిన వారు తెలుగులోనే రాయండి.”ఛెస్! ఇది నా చేతి రాతేనా?” అని మీకు అనిపించకపోతే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానట్టే. నేను నిఖార్సయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ని.

అక్షరాలా బాసరలో అక్షరాబ్యాసం చేయించినా నా రాత – తలరాత, చేతిరాత ఇలానే తగలడ్డాయని అప్పుడప్పుడు మా నాన్న వాపోతుండేవారు . కాని ఇందులో నాతప్పేమీ లేదని నేను మీకు ఈ బ్లాగ్ముకంగా తెలియచేస్కుంటున్నాను . నాకు గుర్తున్నంతవరకూ “శ్రీ” అని “ఓం సరస్వతే నమః” అని “మహేష్ బాబు” అని అక్షరం పొల్లుపోకుండా కరట్టుగా రాశాను. పైన దేవుడు కూడా నా రాత అలానే రాసుంటాడు అని ఆశిస్తున్నాను.

నీచమందు పరమ నీచము వేరయా అని మా నాన్న గారికి సాక్ష్యాలతో సహా చూపిద్దాము అని ఇద్దరు,ముగ్గురు స్నేహితులను వారి “ఆటోగ్రాఫ్” అడిగాను.

మిత్రుడు1 నా మీద దయతో ఒక పెద్ద వ్యాసం రాసిచ్చాడు. నేను అనుకున్నదానికంటే జుగుప్సాకరంగా ఉన్న అది చూస్తే  నా చిరు ప్రయత్నం సఫలం అన్న నమ్మకం నాలో ఏర్పడింది. అది ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం నన్ను ఉండబట్టనివ్వలేదు. రాత్రంతా ప్రయత్నించినా ఇంకా అర్ధం కాని పది,పన్నెండు పదాలు ఉండిపోయాయి. “ఇదేమిటో చదివిపెడుడువూ ప్లీజ్” అని దయనీయంగా అడిగేసరికి తీసుకుని ఒక పావు గంట ప్రయత్నించాడు. నిన్న రాస్తే ఇవ్వాళ తీస్కొచ్చి అడిగితె ఏటిగుర్తుంటాది? అని నన్నే ఎదురు ప్రశ్నించి చక్కాపోయాడు.

మిత్రుడు2 ఇచ్చిన కాగితం ఎక్కడుందా అని వెతుకుంటే “పద్మ” ప్లగిన్ ఇన్స్టాల్ చెయ్యని పాత మొజిల్లా బ్రౌసర్ లాగా గజిబిజిగా ఉన్న ఒక కాగితం కనిపించింది. చివర పేరుని బట్టి అది తనదే అని రూఢీ చేసుకున్నాను. అది ఏమిటో తెలుసుకోవాలన్న కోరిక నాలో ఏ మాత్రం కలగలేదు.

ఇక మూడో మిత్రుడి చేతిరాత గూర్చి ఒక లఘు చిత్రం తియ్యచ్చు. కష్టాలు,కన్నీళ్లు లేకుండా షార్ట్ గా ఒక కమర్షియల్ లఘు చిత్రం తియ్యమన్న మా టీవీ వారి సవాలు కి నా జవాబుగా అది పంపుదాం అని అనుకున్నాను. ఈ సదరు మిత్రుడు అమెరికా లో ఉండటం వల్ల ఆ ఆలోచన విరమించుకున్నాను. ఒక కోడి కాళ్ళను నల్లటి సిరాలో ముంచి ,తెల్లటి కాగితం మీద దాన్ని పరుగులు పెట్టిస్తే కింద మిగిలే అచ్చులే తన అక్షరగుళికలు. ఈ టపా చదువుతున్న ఓ మిత్రరాజమా, తమ్ముడు సినిమాలో ఆన్సర్ పేపర్ అందుకుంటున్న పవన్ కళ్యాణ్ లాగా కాసేపు పొంగిపోయి మురిసిపో!

source: igas.com

“దీన్ని తెలుపు అంటే మరి దీన్ని ఏమంటారు?” అన్న రీతిలో “నా చేతిరాత చెత్తగా ఉంది అని అంటున్నారు..మరి వీటిని ఏమంటారు అని” మా నాన్నగారికి చూపించాను. నేను అనుకునట్టుగానే ఆయన “అవాక్కయి” గుడ్డి కంటే మెల్ల మేలని అభిప్రాయపడ్డారు. కాని వెంటనే ఇక నుంచి అయినా కాస్త ఓపిక పెట్టి అక్షరాలు అందంగా కాకపోయినా అర్ధమయ్యేట్టు రాయమ్మా అని ప్రాధేయపడ్డారు. ఇలానే పోతే నిన్ను కూడా ఎవరో ఒకరు “ఆటోగ్రాఫ్” అడుగుతారు జాగ్రత్త అని హెచ్చరించారు. అర్ధమయ్యేలా రాస్తే మన జవాబులు అర్ధమైపోయి మార్కులు తగ్గుతాయేమో అని భయపడి నాకు వచ్చినవి మటుకు అర్ధమయ్యేలా రాసేదాన్ని.

ఇక హైస్కూలు లో ఏం జరిగిందో ఇక్కడ నేను చెప్పాలి. దస్తూరి అంటే ఎలా ఉండాలో తెలుసా? ముత్యాల దండలాగా అక్షరాలతో హారం అల్లినట్టు ఉండాలి. మనకి పొడి,పొడి అక్షరాలు రాయటమే రాదే ఇక గొలుసు కట్టు కూడానా? అని మా తెలుగు మాస్టారు నిష్టూరాలు ఆడారు. అప్పటికే మా నాన్నగారు పొగిడినందుకు తులసి చెట్టు ఎక్కిన  నేను జాగ్రత్తగా దిగేసి (మా ఇంట్లో చింతచెట్టు లేదు) మాస్టారు గారికి నా తడాఖా  చూపిద్దాము అని ఆ పనిలో పడ్డాను. కుడి చేత్తో వచ్చి ఏడవటం లేదని ఎడమ చేత్తో, తరవాత నోటితో, కాళ్ళతో కూడా ప్రయత్నించాను. అక్షరాలని కలపగాలిగాను గాని ఆ కలగాపులగాన్ని రెండోసారి చూసుకునేందుకు నాకే మనసు ఒప్పలేదు. కనీసం నమూనా అయినా లేదే అని  బాధపడుతుంటే భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ రాసే లాంటి అందమైన దస్తూరితో ఉన్న మా బామ్మ ఉత్తరం దొరికింది. “చిరంజీవికి నా ఆశీస్సులు” తో మొదలైన ఆ ఉత్తరం “- అమ్మ ” తో ముగిసింది. ఓపెనింగ్ లైన్ చూసిన ప్రతిసారి మా బామ్మ చిరంజీవి ఫ్యాన్ ఏమో , అందుకే మా నాన్నని అలా  పిలుచుకుంటోంది అనుకునేదాన్ని. ఒక మధ్యాహ్నం టీవీలో రుద్రవీణ సినిమా చూసి “లక్షణంగా ఉన్నాడు, ఎవరే ఆ అబ్బాయి?” అని అడిగేంత వరకు తన(నా) అమాయకత్వం నాకు అర్ధం కాలేదు. ఇంతకంటే పవిత్రమైనది ఏముంటుందని అదే రాతను మక్కికి మక్కి దించేటట్టు సాధన చెయ్యటం మొదలుపెట్టాను. తర్వాత నా ప్రాక్టీసు ను చేతిరాతల నుండి సంతకాలకు పెంచాను అనుకోండి, అది వేరే విషయం. అనుకున్నట్టు గానే నా ప్రయత్నం ఫలించింది. నా రాత  మారింది. నా తలరాతను మార్చింది. అప్పటిదాకా నల్ల బోర్డు పైన ఒక్క అమ్మాయి చేతే రాయించేవారు. ఆ తరువాత నుండి ఆ గౌరవపదవిని నేను అలంకరించటం మొదలుపెట్టాను. “నీట్ ” అని, “చక్కటి దస్తూరి” లాంటి కాంప్లిమెంట్స్ అనబడే కామెంట్స్ తో పటు 1-2 కొసరు మార్కులు దక్కించుకున్న ఘనత కూడా నాకు అప్పట్లో దక్కింది. అలా గ్రీటింగ్ కార్డ్ల మీద మేసేజీలు రాస్తూ ఒకింత గర్వంతో నా స్కూలు పర్వం ముగించేసాను. “మనకు వచ్చిన పని ఫ్రీగ చెయ్యకూడదు” అనే సూత్రం తెలీకుండానే.

దీపావళి


“ఏరా బుడ్డోడా… ఈ దీపాలికేటి కొనిత్తునాడేటి  మీ అయ్య?”
“పటాసులు తెమన్నా పట్నం నుండి..”
“ఇస్కూలు కాడ ఇడేన్లు అమ్ముకునే మీ అయ్య నేటి తెత్తాడు ? రేపు దీపాల పండగ గందా ..మా యింటికాడ సుట్టాలోచ్చే యేల ఒత్తావా ? రెండొందలిత్తాను ..నీకు మనసైనయన్ని కొనుక్కో మారాజు లాగా”
“రాడు బాబు యీడు .. ”
“అలవాటు కానివే గవురీ..ఇంకో అయిదేళ్ళు ఎలిపోచ్చాక మా యింటికే గందా ఈడోచ్చేది?”
“రాడు బాబు..యీడు సదువుకుని పట్నం కాలేజీకి పోటానికే గందా మా ఈ కట్టం అంతా?”
“తిండికి లేదు కాని పౌరుసానికి ఎం తక్కువ లేదు ..అరిగిపోతాడా మీ చంటాడు బాయిలో నీళ్ళు తోడి, ఇంటికాడ బస్తాలు మొత్తే?”
“చంటాడు గందా అందుకే నానంపట్లేదు..మీకు రోక్కవులో తూగలేము ఏమో కాని పేవలో మీ యంతా ఉన్నోల్లమే..ఇయ్యాల పని ఐపాయింది..పండగ ఎల్లిపోనాక ఒత్తాను.”
“ఇంటికి సుట్టాలోత్తున్నారు అంటే పనికి రాను అంటావేతే?”
“అమ్మగోరుకి సెప్పినాను. ఎలిపోచ్చేయ్మన్నారు.”
“అయ్యేం కాదు కాని..నువ్వు అయినా రా..ఈడ్ని అయినా  అంపు.”
“అన్నాయం బావుగారు..పండగ ఒవలికైన పండగే గందా?”
“మీ యిద్దరూ మానేత్తాం అంటే సేప్పండహే ..కొత్తోల్లని పనిలో ఎట్టుకుంటాము”.
“నానే వత్తాను. ఇయ్యాల్టికి ఉంటానయ్య.”
“ఏటిరా..మీ అయ్యని పటాసులు తెమ్మాన్నావా?”
“తప్పు సేసానేటే? ఆ రాజుగాడు,సామిగాడు ముంజికాయలు అనీ  , చెగోనీలు అనీ యేటో ఒకటి తినేతోల్లు…. అది సూసినప్పుడల్లా గుండిల్లో నోస్తాంది. యీలుంటే పటాసులు తెమ్మన్నా. అయ్యన్నా కాల్చి ఆల్లకి సెప్పుకుని మురిసిపోదామని..అయ్యకి కట్టం అని నాకు అప్పుడు అగిపీలేదు. ఒల్లకున్డమని సేప్పోచ్చీనా?”

DSC_0360
“తప్పేటి లేదేహే..కాని మీ అయ్యా కాడ రోక్కవు ఉండదు గందా…ఏటీ కొనలేడు..మన కరమ”
“ఏటమ్మా .. ఎడుత్తున్నావు?”
“ఏటీ నేదు గాని.. ఆ రాజుగాడు వరి పాయసం తాగినాడా?”
“నేదు..”
“నీకీ పండగ్గకి అది కాసి పెడతా.”
“నిజ్జంగా?”
“నీ తోడు. లోనకెళ్ళి ఆడుకో.”
“మా యమ్మ బంగారమే.”
“మజ్జాన్నం వన్నం తింటే రేతిరి ఉపాసం ఉండే మనకు పరమాన్నం యాడ దొరుకుతుందే?”
“నువ్వా అత్తా…అడుక్కుతెత్తాను.”
“ఒవలు ఇత్తారే గుప్పెడు బియ్యం?”
“ఆ పంతులమ్మ కాడికి ఎల్లి ఇట్టా సంటాడి కోసం అని సెప్తే ఇత్తాదేమోనే. మడిసి బంగారం. ”
“ఏటీ నిచ్చేది? రేపు సుక్రారం గందా.. ఆ యమ్మ నీకు కానీ కూడా ఇయ్యదే.”
“ఆ కిరానా సాంబడు?”
“కోమటోడు ఆడు అస్సలే ఇయ్యడే. లచ్చిమ దేవిని అప్పనంగా ఒవలు అమ్పుతారు ?”
“అడిగినోల్లకి ఎట్టకుండా దాసుకు తినేత్తే లచ్చిం దేవి ఏటీ అనదేటి?”
“ఎల్లోసే. నీ కాడ రోక్కవుంటే నువ్వు దరమాలు,దానాలు సేసేదానివేటి? నా బిడ్డ సుకవూ,నా బిడ్డ సదువూ అని ఇనపిట్టి లోనేట్టుకునేదానివి.”
“ఆకలి రుసి నానేరుగుదును. బిడ్డ ఆకలి కోసం ఒవలన్న నా కాడ సెయ్యి సాత్తే నాను ఒల్లకుండను.”
“సాలోసే మాతలు. ముందు ఆడికి పరమాన్నం సేయ్యటం ఎలాగీ?”
“సుట్టాలోత్తున్నారని ఆ రాజుగారు రేపు  ఒచ్చీమన్నారు. ఆయమ్మనే రోక్కవు బదులు బియ్యం అడుక్కుంతాను.”
“ఆడుత్త ఎదవేహే. రోజు కూలీకి బియ్యం ఇత్తాడా?”
“ఇత్తాడు కానీ  గిన్జీ,గిన్జీ ఏరి,ఏరి ఇత్తాడు.”
“ఏటే అత్తగోడళ్ళు తెగ నవ్వీస్కున్తున్నారు?”
“ఒచ్చీవా మల్లెసూ..మీ సంటాడికి పరమాన్నం కాసిత్తానని మహాతల్లి సెప్పింది. బియ్యం ఒవలిని అడుక్కోవాల”
“అడుక్కునేదేటెహె. నాను కొనుక్కొచ్చినాను. టపాసులు, బియ్యవూ,పప్పూ..”
“బోనిలే ఉండయి మజ్జానానికి ఎలిపోచ్చేత్తానన్నావు..ఇయన్నీ ఏ కొంపకి కన్నమీసి తెచ్చావురా?”
“ఒకటే బోనీ తగిలిందే. ఒక ముసిలి అవ్వా, ఆళ్ళ ఇంటయాన, ఆళ్ళ మనోడు. ఆ బుడ్డోడు బండి కాడి పూర్లు తింటా అని గోల. ఆ ముసిలి అవ్వ నేదు ,సుబ్బరం నేదు,సుచీ నేదు అని అంటే ఆ బుడ్దోడ్డు యినడే. ఇంక నాను పూర్లు మీ కల్లముందే ఎసిత్తా ఉండమ్మా అంటే అప్పుడు సెప్పింది ఆళ్ళ డబ్బుల  సంచీ సంత కాడ ఒవలో కొట్టీసినారు. డబ్బులోద్దు అని నానే ఆల్లకి పూర్లు,ఇడేన్లు ఏసీ నెడితే కడుపు నిండా తిని దీవించి ఎల్లిపాయింది మా తల్లి. ఆళ్ళ టపాసుల సంచీ మన బండి కాడే  ఒగ్గీసి ఎల్లిపోతే మన సంబిగాడ్ని కాపలా ఎట్టి  నానెల్లి ఆళ్ళకి ఇచ్చి ఒచ్చీను. ఆ యమ్మ ఆల్లింటికి తీస్కెళ్ళి అయిదు ఒందల నోటు సేతిలో నెట్టి టపాసులు కొన్నిచ్చి మీ సంటాడికి ఇయ్యమని ఇచ్చింది.”
“నీ మంచితనమే నీ భగమంతుడురా మల్లేసు. అదే నీ కట్టాల నుండి నిన్ను నీ ఒల్లని రచ్చిత్తుంది.”
“రేయ్ సంటీ..మీ అయ్య ఒచ్చేసినాడు. ఒచ్చి నీ టపాసులు సూస్కో.”