అరవింద్!

ఏదో అలికిడి అయితే ఆలోచనల్లో నుండి బయటకొచ్చి తల తిప్పి చూసాను. ఇంటి ముందు “ది లాస్ట్ జర్నీ” వ్యాను వచ్చి ఆగింది. అరవింద్ దిగి వాళ్ళకి ఎంతో ఇచ్చి పంపించేసాడు. లోపలికి వచ్చి ఇక అంతా ఐపోయింది అన్నట్టు సైగ చేసాడు.తన కళ్ళల్లో నీళ్ళు! నిన్న అభిని పడుకోబెట్టిన చోట కుర్చుని కాసేపు నేలని తడిమాడు. ఎంతో చురుగ్గా, అందంగా, గీసినట్టు ఉండే అరవింద్ కళ్ళు ఇప్పుడు భయంకరంగా ఎర్రగా ఉన్నాయ్. మరి మూడు రోజుల నుండి తిండి లేదు, కునుకు లేదు ఇద్దరికీ. అసలు అభికి ఇక ఎక్కువ సమయం లేదు అని తెలిసినప్పటి  నుండే అరవింద్ అసలు మనిషి మనిషిలో లేడు. నెమ్మదిగా కళ్ళు మూస్కుని గోడకి వాలాను.

మొదటి నుండి కూడా తనకి ఆడపిల్లే  కావాలి అని అరవింద్ అనేవాడు. ఎందుకు అంత ఇష్టం అంటే కూతురు అయినా,

అమ్మ అయినా, భార్య అయినా, చెల్లి అయినా -అసలు ఏ వరస అయినా సరే ప్రతి అమ్మాయిలో ఒక అమ్మ ఉంటుంది అని చెప్పాడు. తనని కన్న అమ్మ వయసుని, బుద్ధిని, సంస్కారా న్ని పెంచే అమ్మ అయితే , తను కన్న అమ్మ తన పరువుని,పెంపకాన్ని,బాధ్యతని పెంచే అమ్మ అంట. ఇక అనుకునట్టే అభి పుట్టినప్పుడు అయితే తన ఆనందానికి అవధుల్లేవు. అమ్మాయే పుడితే తిరుమల పైకి నడిచి వస్తా అని మొక్కుకున్నాడు. అది పుట్టిన రోజే వెళ్లి మొక్కు తీర్చుకుని వచ్చాడు.దాన్ని చూస్తూనే నాతో అన్నాడు..ఒక ఆడపిల్ల కి సంబంధించిన ప్రతి పండగ జరిపిద్దాం.అది కూడా చాలా గొప్పగా చేద్దామని. అన్నట్టే అన్నీ క్రమంతప్పకుండా చేస్తూ వచ్చాము. చిన్న పిల్లలు స్పర్శద్వారా గుర్తుపెట్టుకుంటారు అని ఏదో శాస్త్రం. అందుకే తనే దానికి స్నానం చేయించేవాడు. దాని తిండి,నిద్ర,బట్టల విషయాల్లో కూడా తనే ఎక్కువ శ్రద్ధ చూపించేవాడు. కొన్నిసార్లు నా మాట కూడా వినేవాడు కాదు. ఒక విధంగా చెప్పాలంటే తనే దానికి తల్లి అయిపోయాడు.

ఇప్పుడు అరవింద్ కూర్చున్న చోటే దాన్ని మొదట ఉయ్యాలలో వేసింది. అక్కడే దాని అన్నప్రాసన, మొదటి పుట్టినరోజు, అక్షరాభ్యాసం. ఆ చోటు అంటే తండ్రికూతుళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళు రోజూ అక్కడే ఆడుకునే వాళ్ళు. దాని వయసులో మా నాన్న నన్ను ఎలా చూస్కున్నారో గుర్తులేదు కానీ, మా నాన్న అంటే జడిసే నాకు ఇలా మటుకు చూస్కుని ఉండరు అని అనిపించేది. ఇక అది కష్టపడి “నానా” అన్న రోజు అరవింద్ మోహంలో ఎంత ఆనందం కనిపించిందో మాటల్లో చెప్పలేను.గమ్మత్తుగా అది నాన్న ఏడి అన్నా,అమ్మ ఏడి అన్నా అరవింద్ నే చూపించేది. మమ్మీ అంటే నన్ను చూపించేది. అమ్మ, మమ్మీ ఒకటేనే అని ఎంత చెప్పిన అర్ధం చేస్కునేది కాదు.అరవింద్ ఏమో ఉడుక్కుంటున్న నన్ను చూసి ఇంకా రెచ్చగొట్టేవాడు.
ఏదో సినిమా లాగా, కల్పితకధల్లో లాగా ఉండేవాళ్ళు ఇద్దరు. హాఠాత్తుగా ఒక రోజు ఏదో నోరు తిరగని రోగం దానికి ఉందని చెప్పి డాక్టర్ ఐసీయూ లో పెట్టారు. మొదట్లో నాకేమి అర్ధం కాలేదు. ఆరవింద్ ని అడిగితే ఏం కాలేదు,ఏదో చిన్నదే, పట్నంలో ఇవి మామూలే  అని చెప్పి దాటేసాడు. కానీ అభి వెళ్ళిపోయే ముందు రోజు మాత్రం మనకే ఎందుకిలా జరిగింది అంటూ ఏడ్చాడు. ఇద్దరం ఉన్నప్పుడే దాన్ని వెంటిలేటరు తీసేసి డాక్టర్ తీస్కెళ్ళిపోమన్నాడు. తీస్కెళ్ళిపొమ్మంటే అది అప్పటికే వెళ్ళిపోయింది అన్న సంగతి నా మట్టి బుర్రకి అర్ధం కాలేదు. ఏదో అద్భుతం జరుగుతుంది ఏమో అని అతి చిన్న ఆశతో ఉన్న నాకు దేవుడు ఉన్నాడనిపించింది. కాని ఆరవింద్ ఏడుపు చూసాక ఘోరం జరిగిపోయింది అని బోధపడింది. మగవాళ్ళు ఆడవాళ్లలాగా ఏడవరు అనుకునేదాన్ని. ఆరవింద్ ని అప్పుడు చూస్తే కంట తడి పెట్టని వారుండరు. నేనే తన భుజం మీద చెయ్యివేసి పెద్ద ఆరిందాలాగా దైర్యం చెప్పజూసాను.నా వల్ల కాలేదు!
ఇంటికి వచ్చాక దానికి ఇష్టమైన చోట పడుకోబెట్టాము.నిర్జీవంగా పడివున్న దాని శరీరాన్ని నేను అసలు కనీసం ముట్టుకోలేకపోయాను. అరవింద్ మాత్రం కళ్ళని చేత్తో మూసుకుని ఏడుస్తూనే ఉన్నాడు. నెమ్మదిగా జనం వచ్చారు. అన్నీ శాస్త్రోక్తంగా జరిగాయి.దెగ్గరి చుట్టాలు తప్ప అందరూ వెళ్ళిపోయారు. కాస్త తేరుకున్న నేను మర్యాద చెయ్యబోతే వారించి పక్కన కూర్చోమన్నారు. అప్పటినుండి ఇలా ఆలోచనల్లో-కాదు కాదు , జ్ఞాపకాల్లో తేలుతున్నాను.
మళ్లీ అలికిడి అయితే కళ్ళు తెరిచి చూసాను.
“అరవింద్ గారి ఇల్లు ఇదేనామ్మ?”
“అవును..ఆయనే” అని చెప్పి పడుకున్న అరవింద్ ని చూపించాను.
“అరవింద్..ఒక్కసారి లేవండి” అని తనని తట్టాను.
ఒళ్ళంతా చల్లగా ఉంది. భయంతో ఒక్క నిమిషం నా ఊపిరి ఆగిపోయింది.
కాని,వాళ్ళ అమ్మ ఇక లేదని అరవింద్ ఊపిరి శాశ్వతంగా ఆగిపోయింది.

13 Comments

  1. “తనని కన్న అమ్మ వయసుని, బుద్ధిని, సంస్కారా న్ని పెంచే అమ్మ అయితే , తను కన్న అమ్మ తన పరువుని,పెంపకాన్ని,బాధ్యతని పెంచే అమ్మ అంట”

    ఇది చాలా బాగా రాశావ్. కథనం ఎప్పటిలాగే బావుంది. కాని, శిల్పం మీద ఇంకొద్దిగా దృష్టి పెట్టుంటే బావుండేది.

    స్పందించండి

  2. one word : speechless..

    “తనని కన్న అమ్మ వయసుని, బుద్ధిని, సంస్కారా న్ని పెంచే అమ్మ అయితే , తను కన్న అమ్మ తన పరువుని,పెంపకాన్ని,బాధ్యతని పెంచే అమ్మ అంట.”

    “ఏదో సినిమా లాగా, కల్పితకధల్లో లాగా ఉండేవాళ్ళు ఇద్దరు. ”

    “తనని కన్న అమ్మ వయసుని, బుద్ధిని, సంస్కారా న్ని పెంచే అమ్మ అయితే , తను కన్న అమ్మ తన పరువుని,పెంపకాన్ని,బాధ్యతని పెంచే అమ్మ అంట.”

    especially Ee moodu sentences enta baaga raasav.. hats off !!

    స్పందించండి

  3. typo in the above comment : this was the last sentence..

    ఒళ్ళంతా చల్లగా ఉంది. భయంతో ఒక్క నిమిషం నా ఊపిరి ఆగిపోయింది.
    కాని,వాళ్ళ అమ్మ ఇక లేదని అరవింద్ ఊపిరి శాశ్వతంగా ఆగిపోయింది.

    స్పందించండి

  4. తెలుగు సినిమాల్లో మామూలుగా తండ్రి పాత్ర మీ కథలోని తల్లి పాత్రలా, తల్లి పాత్ర (read nirmalamma or lakshmi) మీ కథలోని తండ్రి పాత్రలా వుంటుంది… at least you break the cliche. ఇదంతా నిజంగానే జరిగిందేమో అనిపించేంత హృద్యంగా వుంది చిత్రీకరణ. ఇహ కథనం, శిల్పం లాటి పేధ్ద పేద్ద పదాల గురించి నాకయితే తెలీదు 😛

    స్పందించండి

వ్యాఖ్యానించండి