కరువు -బరువు


“మీకో చిక్కు ప్రశ్న వేస్తాను..మీరు కరెక్ట్ గా చెప్తే మీకు నా తరఫున నుండి ఒక బ్రహ్మాండమైన గిఫ్ట్ ఉంటుంది..” అంది మా ఆవిడ టీవీలో యాంకర్ లాగ వయ్యారాలు పోతూ.
“నీ గిఫ్ట్ ఏం అక్కర్లేదు కాని ప్రశ్న ఏమిటి?”
“​వీరిలో భారతదేశపు మహిళా రాష్ట్రపతి ఎవరు? అ) శ్రీమతి ప్రతిభ పాటిల్ ఆ)అటల్ బిహారీ వాజ్ పేయి “
“​ఇదేమి ప్రశ్నే! వాజ్ పేయి అసలు మహిళ కాదు. రాష్ట్రపతి కానే కాదు. ఇలాంటి ఆప్షన్స్ ఇస్తే ఎవరైనా చెప్పేస్తారు!”
“మీకేం తెలియదు..ఇలానే అడగాలి..నేను ఇంకా మిమ్మల్ని తికమక పెట్టేస్తా అనుకుని తెగ సంబరపడిపోయాను. మీరు చాలా తెలివైన వారండి ఎంతైనా..”
“సంతోషించాంలే గాని ఇవ్వాళ వంట ఏమిటి?”
“ఆంటిపాస్తో” అండి మా ఆవిడ గంభీరంగా మొహం పెట్టి..
నేను కంగారుపడి ఎవరన్నా వచ్చారేమో అని లేచి నిలబడ్డాను. చూస్తే ఎవరు లేరు..
“ఎవరే వచ్చింది?”
“ఎవరు రావాలి?”
“ఎవరో ఆంటీ అన్నావు?”
“మీ మొహం..ఆంటిపాస్తో అన్నది ఇటాలియన్ వంటకం.”
“బాబోయి..అది తింటే నాకు కూడా చంటబ్బాయిలో ఎడిటర్కి ​మల్లే ​జ్ఞానోదయం అవ్వదు కదా?”
“మీరు మరీ ​ అండి ​..ఇది ఇవ్వాళ టీవీలో చూపించారు..లో ఫాట్ వంటకం అంట..పైగా చెయ్యటం కూడా చాలా సులువు..ఉట్టి కూరగాయలు కోసేసి పైన ఒక సాస్ పొయ్యటమే”
“అంటే సలాడ్ అన్నమాట..”
“మీకు తెల్సిన భాషలో అదే..”
“సలాడ్ అంటే నేను తినను అని..ఆంటీ అని చెప్పి టెంప్ట్ చేద్దామనుకున్నావా?”
(నవ్వుతూ) “అలానే అనుకోండి..”
“నేను చస్తే తినను”
“ఎలా తినరో నేనూ చూస్తాను..మీరు మూడు కిలోలు బరువు ఎక్కువ ఉన్నారు..ఇలా అయితే మీ ఆరోగ్యం ఏం కాను? రేపటి నుండి పొద్దున్నే నాతొ వాకింగ్ కి కూడా వస్తున్నారు. తినేసి గమ్మున పడుకోకండి..అది అరిగేంతదాక కొంచం అటు,ఇటు బాల్కనీలో నడిచి లోపలకి రండి.” అనేసి ఆవిడ వెళ్ళిపోయింది.
“ఆ గడ్డి అరగటానికి కూడా నడవాలా?”
అటు నుండి ఏమి జవాబు లేదు. నా అర్ధాంగి మౌనంగా అర్ధ అంగీకారం ఇచ్చింది. మిగిలిన సగం నేను మౌనంగా ఇచ్చేశాను. అసలు ఒంట్లో ఏ మాత్రం ఓపిక ఉన్నా వాదించి ఏ వంకాయ్ కూరో చేయించుకుని తినేవాడిని. ఇప్పుడు ఏ మాత్రం తోక జాడించినా మా ఆవిడ ఆ రైతు బజార్ కూడా కట్టేస్తుంది ఏమో అని వెళ్లి టేబుల్ ముందు కూర్చున్నాను.
నేను అలిగితే ముందు అవతల వాళ్ళే మాట్లాడాలి..నేను నీళ్ళు కావాల్సి వచ్చినా వెళ్లి తెచ్చుకుంటానే తప్ప నోరు తెరిచి అడగను. మా ఆవిడ నాలా కాదు..వెరైటీ మనిషి. మా ఇద్దరిలో ఎవరు అలిగినా ముందు అవతల వాళ్ళే మాట్లాడాలి. లేదంటే నీళ్ళు ఇవ్వదు, దాహంతో ఉన్న మన ముందు కూర్చుని స్ప్రైట్, పెప్సి తాగుతుంది. మనమే చచ్చినట్టు మాట్లాడే పరిస్థితి కల్పిస్తుంది. అందుకే ఇలాంటి విషయాల్లో నేను పెద్ద వీరత్వం ప్రదర్శించను. సర్దుకుపోయి నేనే మాట్లాడేస్తాను.
“అవును.. ఎప్పుడూ లేనిది ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టావేంటి బరువు, లావు అని.. “
“మొన్న మేము మాట్లాడుకుంటుంటే మీనాక్షి వాళ్ళ ఆయన వచ్చారు. ఆయన నన్ను ఎంత మాట అన్నారో తెలుసా?”
విషయం బరువు గూర్చి అయినా మా ఆవిడ ఇచ్చినా బిల్డ్ అప్ చూస్తే నాకెందుకో అనరాని మాట అన్నాడేమో, ఈయనకేం పోయేకాలం వచ్చింది అనిపించింది.
” ఏంటమ్మా మీ ఆయనకి జీతం పెరిగింది అంట కదా..నిన్ను చూస్తుంటే తెలుస్తోంది అన్నారు.”
అసలు నాకు జీతం పెరిగింది అని మీనాక్షి గారికి మా ఆవిడే చెప్పింది. నా డెస్క్ మీద ఉన్న పేపర్ వెయిట్ విరిగిపోవటం నుండి నా ప్రమోషన్ పేపర్ పాస్ అవ్వటం వరకు అన్నీ విషయాలు నేను నీలుకి చెప్తాను. ఆవిడ అవి అక్షరం పొల్లు పోకుండా , వీలయితే మసాలాలు, అవి కూరి మీనాక్షి గారికి చెప్పేస్తుంది.
“నువ్వు నీ నగల దుకాణం అంతా చూపించటానికి అరుంధతిలో అనుష్కలాగా వెళ్లి ఉంటావు..” ఒళ్ళు మండి అన్నాను.
“అదేం కాదు..నేను కొంచం ఒళ్ళు వచ్చానుట. అలా అని చమత్కరించారుట. మీనాక్షితో నిజంగా పెరిగానా అని అంటే ఆవిడ ఏమందో తెలుసా..కాదు అనలేదు సరికదా మీరు ఇలానే ముద్దుగా ఉన్నారు అని మాట దాటేసింది.”
“వాళ్ళు నిన్నేం బూతులు తిట్టలేదు నీలూ..కొంచం బొద్దుగా అయ్యావు అన్నారు అంతే..”
“అంటే మీరు కూడా అదే మాట అంటున్నారా?”
“అలా అంటే నన్ను బతకనిస్తావా?”
“అంటే నేను ఊరకుంటే ఎంత మాట అయినా అనేస్తారు అన్నమాట..”
“అది కాదులే కాని..నువ్వు మానేస్తే మానేసావు..నాకెందుకు ఈ కుడితి?”
“మీరు కూడా లావు అయ్యారు..మీ పాత షేడెడ్ జీన్స్ మీకు పడుతుందా ఇప్పుడు?”
“ఇది మరీ బాగుంది..అది నేను పదో తరగతిలో వేస్కునే వాణ్ణి. నేను అది వేస్కోటం మానేసాక గోదావరికి రెండు పుష్కరాలు వచ్చాయి తెలుసా?ఇప్పుడు అది నాకు ఎలా పడుతుంది అసలు?”
“అదే మరి..నేను పట్టిస్తా..నేను చెప్పినట్టు చెయ్యండి..”
*************************
తెల్లవారింది..నాకు ఉద్యోగం వచ్చాక నేను కేవలం రెండు సార్లు సూర్యోదయం చూసుంటాను..ఒకటి ఉషాకిరణ్ మూవీస్ వాళ్ళ పాటలో..రెండు తత్కాల్ టికెట్లు బుక్ చేస్కోటానికి లేచినప్పుడు. మళ్లీ మా ఆవిడ పుణ్యమా అని ఇవ్వాళ చూసాను. ఇంతకీ తను ఎక్కడ ఉందా అని ఇల్లంతా కలియచూస్తుంటే సరికొత్త అవతారంలో ఎదురు అయ్యింది. కింద హాలీవుడ్లో కొన్న షూస్, పైన ట్రాక్ ప్యాంటు, దాని పైన సాఫ్ట్ జాకెట్, జుట్టుకి బ్యాండ్, చెవిలో ఐపాడ్. రోడ్డు పక్కన అమ్మే టెడ్డిబేర్ కి మల్లే ఉంది. నాకు నవ్వొచ్చినా నవ్వితే అది నా ఆరోగ్యానికే చేటు అని అణిచేస్కున్నాను. హైకమాండ్ ఆదేశాలు అందిన వెంటనే నేను కూడా తను చెప్పిన యూనిఫోరంలోకి మారిపోయాను. అల్సేషియన్ కుక్కని “ఉస్కో” అన్నట్టు తను నన్ను చూసి “పదండి” అంది. మా కాలనీ పార్క్లో మా జాగింగ్ ప్రస్థానం మొదలు అయ్యింది. కొంచం దూరం పరిగెత్తగానే మా ఆవిడ అలసిపోయి బెంచ్ మీద కూర్చుండిపోయింది.
“ఏమిటి..దీనికే ఆయసమా? మరీ సుకుమారివి నువ్వు.. “
తను వెంటనే ఒక్క క్షణం రోప్పటం ఆపేసింది. “మీరు ఎక్కిరించకండి.. రోజూ ఇంట్లో బండెడు చాకిరి చేస్తున్నాను..మీలా కూర్చుని తేరగా తినేసి పడుకోవట్లేదు..”నా మీద అస్త్రం సంధించేసి మళ్లీ రోప్పటం మొదలుపెట్టింది.అనవసరంగా కెలికాను అని మనసులో అనుకుంటూ తన పక్కనే చతికిలపడ్డాను.
“అసలు నీకో విషయం తెలుసా నీలూ..తగ్గాలి అనుకుంటే తినే తిండి, నువ్వు చేసే పనికి
​సమతుల్యం ఉండాలి. అంతే కానీ ఓ హైరానా పడిపోనక్కర్లేదు. కొంచం తిండి తగ్గించి, కాస్త వేగంగా వాకింగ్ చేశావే అనుకో..బ్రహ్మాండంగా తగ్గుతావు..”
” ​ఎంత సమయంలో​?”
“​ఎంత ..ఒక 5 -6 నెలల్లో..”
“5 -6 రోజుల్లో తగ్గే మార్గం ఏదన్నా ఉంటే చెప్పండి ప్లీజ్..”
“కష్టం..అలా అయితే మన అభిమాన హీరోల్లాగా నువ్వు కూడా ఆపరేషన్ చేయించుకోవాలి..”
“ఎంత అవుతుంది?”
“ఎంత అయితే నీకెందుకు?రూపాయికి చేస్తా అన్నా నేను పెట్టను..”
“మీరు అసలు నన్ను ఇష్టపడే పెళ్లిచేస్కున్నారా? ఏది అడిగితే అది కాదంటారు.. “
“అసలు నువ్వు ఇప్పుడు అర్జెంటుగా ఎందుకు తగ్గాలి?”
​”వచ్చే సోమవారం మన కాలనీకి ‘మా ఇంటి పెంట’ ప్రోగ్రాం వాళ్ళు వస్తున్నారు..”
“అబ్బా ఈ వంట ప్రోగ్రాం నా ప్రాణం మీదకి వచ్చిందే”
“ఇదే మీతో చిక్కు.. పోయిన​​ మార్చిలో మన కాలనీకి ‘మాయదారి అత్త..మాటకారి కోడలు’ ప్రోగ్రాం వాళ్ళు వచ్చారు .. అప్పుడు కూడా మీరు నన్ను వెళ్ళనివ్వలేదు”
“ఏమిటి ఎవరో ఒక అబ్బాయి జుట్టు మీద కారోప్పొడి జల్లుకుని వస్తాడు..ఎవరు తొందరగా తొక్కలు తీస్తారు.ఎవరు తక్కువ సమయంలో ఎక్కువ రాళ్లు ఏరుతారు? ఇలాంటి పోటీలు ఏవో పెడతారు..ఆ ప్రోగ్రాం ఏనా?”
“అదే.భలే బావుంటుంది కదా?”
“నీ తలకాయలా ఉంటుంది. ​అయినా ఆ మా ఇంటి పెంట గోల మనకెందుకు? కావాలంటే నిన్నా రోజు షాపింగ్ కి తీసుకువెళ్తాను.”
“అప్పుడెప్పుడో ‘వెధవయ్యారా’ ప్రోగ్రాం లైవ్ చూస్తుంటే ఇలాగే బజారు అని చెప్పి మన కాలనీలో చైనా బజారు కి తీసుకెళ్ళారు. అదేం కుదరదు. నేను ఈసారి టీవీలో కనిపించాల్సిందే.”
“​అదేం దిక్కుమాలిన ప్రోగ్రాము?”
“వెధవయ్యారా ప్రోగ్రాంలో యాంకర్ మనకి కాల్ చేసి వెధవా అనంగానే మనం అవును..చెప్పండి అనాలి. అప్పుడు మనం బహుమతులు గెల్చుకునే వాళ్ళం..”

funny telugu cartoon jokes5

source: teluguone.com

​”నువ్వు ఈ ఆటల పిచ్చిలో పడి మంచి ​కార్యక్రమాలు చూడట్లేదు నీలూ .. కాస్త నీ అభిరుచులు మార్చుకోవాలోయ్”
“మంచి కార్యక్రమాలా? ఏంటవి ?”
“పాత పాటలకి ధీటుగా అదే సందర్భానికి కొత్త తరం పాటలు ఎలా ఉంటున్నాయో చెప్పే కార్యక్రమం ఏదో రావాలే ?”
“నాడు-నేడు. అది మీ జీన్స్ లాగే పురాతన కాలం నాటిది. ఇప్పుడు రావటం లేదు”
” కొత్త గాయనీగాయకుల పాటల కార్యక్రమం ఏదో ఉండాలే?”
” ఉన్నది. పాటలు తక్కువ, తతిమ్మా వాళ్ళ బాదుడు ఎక్కువ. “
” ప్రముఖ వ్యక్తులతో ముఖాముఖీలు, వాళ్ళ జీవితానికి సంబంధించిన కార్యక్రమాలు..”
” వారిని కించ పరుస్తూ లేదా వారిని ఇబ్బంది పెడుతూ ప్రశ్నలు అడిగే కార్యక్రమాలు ఉన్నాయి.”
” మంచి సినిమాలు… మంచి ధారావాహికలు . . “
” మనం బయట చూసిన సినిమాలే మళ్లీ మళ్లీ మార్చి మార్చి వెయ్యటం తప్ప ఏనాడైనా ఒక మంచి పాత సినిమా వేస్తున్నారుటండి? మంచి ధారావాహికలా? ఏ కాలంలో ఉన్నారు?”
“వంటా ..వార్పు?” అనేసి నాలుక చర్చుకున్నాను.
“అడిగారూ ..ఆ మధ్య ఎప్పుడో పాలలో ఓట్స్ ఉడికించి దాన్ని పాయసం అని గంట సేపు ఏదో పెద్ద వంటకం అన్నట్టు చెప్పారు. అప్పుడు మీరే కదా నువ్వు కూడా వెళ్ళచ్చు కదే అని సలహా ఇచ్చారు? ఇప్పుడేమో వద్దంటున్నారు.. ” గోముగా అంది.
“అంటే మన టీవీలో చూడదగ్గ కార్యక్రమాలు ఏమీ రావాట్లేదా?” యాభై వేల టీవీని తలుచుకుంటూ అన్నాను.
“మనం చూడదగినవి అయితే ఇంతకు మించి ఏమీ లేవు.”
“​ఇంతకీ ఇప్పుడేం అంటావు ​?”
“నేను ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు నేను వంట చెయ్యవలసిందే. టీవీలో సన్నగా కనిపించవలసిందే.”
కార్యక్రమాల కరువు వల్లో, మా ఆవిడ అన్నట్టు ఒంట్లోని బరువు వల్లో తెలీదు.. భలే నీరసంగా అనిపించింది.

11 Comments

  1. This is highlight “తెల్లవారింది..నాకు ఉద్యోగం వచ్చాక నేను కేవలం రెండు సార్లు సూర్యోదయం చూసుంటాను..ఒకటి ఉషాకిరణ్ మూవీస్ వాళ్ళ పాటలో..రెండు తత్కాల్ టికెట్లు బుక్ చేస్కోటానికి లేచినప్పుడు”

    స్పందించండి

  2. ‘రోడ్డు పక్కన అమ్మే టెడ్డిబేర్ కి మల్లే ఉంది’

    “వెధవయ్యారా ప్రోగ్రాంలో యాంకర్ మనకి కాల్ చేసి వెధవా అనంగానే మనం అవును..చెప్పండి అనాలి. అప్పుడు మనం బహుమతులు గెల్చుకునే వాళ్ళం..”

    Blame u for making me explain to my whole team, for i laughed out real loud reading ur post. Ur wit is ever amusing 🙂 Good to see u come back on ur telugu blog!

    స్పందించండి

వ్యాఖ్యానించండి